
గుంటూరు, 18 జనవరి 2026:-మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని, పేదల హక్కులను హరిస్తున్న వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అజీవక మిషన్ గ్రామీణ్ (విబిజి రాంజీ) చట్టాన్ని రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం గుంటూరు జిల్లా కార్యదర్శి ఈమని అప్పారావు డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 12వ తేదీన దేశవ్యాప్తంగా జరగనున్న సమ్మెలో ఉపాధి హామీ కూలీలు, పేదలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఆదివారం పాత గుంటూరులోని సీఐటీయూ జిల్లా కార్యాలయంలో కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈమని అప్పారావు మాట్లాడుతూ, ఉపాధి హామీ చట్టం స్ఫూర్తికి సమాధి కడుతున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం 40 శాతం నిధుల భారం రాష్ట్రాలపై మోపి కేంద్రం తన బాధ్యతల నుంచి తప్పుకుంటోందని విమర్శించారు. మహాత్మా గాంధీ పేరును కూడా సహించలేని మతోన్మాద పాలకులు, చట్టంగా ఉన్న ఉపాధి హామీని స్కీమ్‌గా మార్చి, క్రమంగా నిర్వీర్యం చేసే కుట్రకు పాల్పడుతున్నారని ఆరోపించారు.GUNTUR
స్వాతంత్ర్యం అనంతరం గ్రామీణ పేదల కోసం వచ్చిన చట్టాల్లో మహాత్మా గాంధీ పేరుతో ఉన్న ఈ చట్టం అత్యంత ప్రాధాన్యత కలిగినదని పేర్కొన్నారు. ఉపాధి హామీ చట్టం అమలుతో పేదరికం, వలసలు కొంత మేర తగ్గాయని, స్త్రీ–పురుషులకు సమాన వేతనం లభించిందని, పెత్తందారులను ఎదుర్కొనే ధైర్యం కూలీలకు వచ్చిందని తెలిపారు. చిన్న, సన్నకారు రైతుల భూములు అభివృద్ధి చెందాయని, వేలాదిమంది యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు లభించాయని చెప్పారు. మొత్తం మీద గ్రామీణ పేదలకు ఉపాధి హామీ ఒక హక్కుగా మారిందని స్పష్టం చేశారు.
ఇంతటి ప్రాధాన్యత కలిగిన చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వాలపై భారం మోపుతూ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకురావడం దుర్మార్గమని విమర్శించారు. దీనికి మన రాష్ట్రానికి చెందిన పార్లమెంటు సభ్యులందరూ ఆమోదం తెలపడం అత్యంత విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
పేదలకు వ్యతిరేకమైన విబిజి రాంజీ చట్టాన్ని రద్దు చేయాలని, రైతాంగానికి కనీస మద్దతు ధరలపై చట్టం చేయాలని, కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేసి మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన లేబర్ కోడ్లను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ల సాధన కోసం ఫిబ్రవరి 12న దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు ఇచ్చిన సమ్మె పిలుపును జయప్రదం చేయాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు జెట్టి బాలరాజు, నాయకులు గడ్డం అజయ్ కుమార్, నీరుడు దుర్గారావు, మేరీ, భద్రయ్య, అంకమ్మరావు, ఖాదర్ బాబా, భాస్కరరావు, రామారావు, శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.










