
– ఏలూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ భవనంలో ప్రత్యేక సదస్సు – ఉచిత న్యాయ సేవలను సద్వినియోగం చేసుకోవాలి: డీఎల్ఎస్ఏ కార్యదర్శి రత్నప్రసాద్ – చట్టాలను దుర్వినియోగం చేయొద్దు: మహిళా పోలీస్ వింగ్ డీఎస్పీ రవిచంద్ర – ప్రభుత్వ పథకాలతో ఆర్థికాభివృద్ధి: ఐసీడీఎస్ పీడీ శారద
ఏలూరు: మార్చి 8వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న వారోత్సవాల్లో భాగంగా, ఏలూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (డీఎల్ఎస్ఏ) భవనంలో మహిళలకు చట్టాలు, హక్కులపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. మహిళలకు చట్టాలతో పాటు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె. రత్నప్రసాద్ తెలిపారు.
ఉచిత న్యాయ సేవలు వినియోగించుకోవాలి: కె. రత్నప్రసాద్, డీఎల్ఎస్ఏ కార్యదర్శి సదస్సును ఉద్దేశించి డీఎల్ఎస్ఏ కార్యదర్శి కె. రత్నప్రసాద్ మాట్లాడుతూ.. మహిళలు ఎదుర్కొనే సమస్యల పరిష్కారానికి న్యాయ సేవాధికార సంస్థలు ఉచితంగా న్యాయ సేవలు అందిస్తున్నాయన్నారు. ఉద్యోగినులు, కార్మికులు పనిచేసే ప్రదేశాల్లో ఎదురయ్యే లైంగిక వేధింపులను ‘పోష్’ (POSH) చట్టం ద్వారా సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని వివరించారు. సమాజంలో బాల్య వివాహాల వల్ల మహిళలు మానసిక పరిపక్వత లేక అనేక కుటుంబ సమస్యలు ఎదుర్కొంటున్నారని, ఈ ముప్పు నుంచి మహిళా సమాజాన్ని రక్షించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. న్యాయపరమైన సమస్యలు, సందేహాలు ఏవైనా ఉంటే ఉచిత టోల్ ఫ్రీ నంబర్ 15100 కు కాల్ చేసి పరిష్కారం పొందవచ్చని సూచించారు.
చట్టాలను దుర్వినియోగం చేయరాదు: రవిచంద్ర, డీఎస్పీ (మహిళా పోలీస్ వింగ్) సమస్యల పరిష్కారానికి చట్టాలను సరైన మార్గంలో ఉపయోగించుకున్నప్పుడే న్యాయం జరుగుతుందని మహిళా పోలీస్ వింగ్ డీఎస్పీ రవిచంద్ర స్పష్టం చేశారు. హక్కుల పేరుతో చట్టాలను ఎట్టి పరిస్థితుల్లోనూ దుర్వినియోగం చేయకూడదని ఆయన హితవు పలికారు. మహిళల సమస్యల పరిష్కారానికే మహిళా పోలీస్ స్టేషన్లు నిరంతరం పని చేస్తున్నాయని, చిన్న చిన్న కుటుంబ సమస్యలను సామరస్య వాతావరణంలో పరిష్కరించుకోవడం ఉత్తమమని ఆయన సూచించారు.
పథకాలను సద్వినియోగం చేసుకోవాలి: శారద, ఐసీడీఎస్ పీడీ మహిళల సంక్షేమం, సాధికారత కోసం ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాయని, వాటిని సద్వినియోగం చేసుకుని అభివృద్ధి పథంలో పయనించాలని ఐసీడీఎస్ పీడీ శారద కోరారు. మహిళల సమస్యలను పరిష్కరించడానికి న్యాయ, పోలీసు వ్యవస్థలతో పాటు ప్రభుత్వ అధికారులు నిరంతరం కృషి చేస్తున్నారని, మహిళలు ఈ సేవలను వినియోగించుకోవాలని ఆమె వివరించారు.Eluru Local News
ఈ కార్యక్రమంలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (CWC) ఇన్ఛార్జ్ చైర్ పర్సన్ పి. వెంకటేశ్వరరావు, వైద్య ఆరోగ్య శాఖ ప్రతినిధి శ్రీమతి జ్యోతి, సీడీపీఓలు శ్రీమతి పద్మావతి, శ్రీమతి తులసి తదితరులు పాల్గొన్నారు.







