
అమరావతి:25 9 25 :- మహిళా సాధికారితపై దృష్టిసారించిన రాష్ట్ర ప్రభుత్వం, గార్మెంట్ పరిశ్రమల్లో మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు చేపట్టిందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత వెల్లడించారు. శాసనసభా సమావేశాల్లో గురువారం ఎమ్మెల్యే బత్తుల బాలరామకృష్ణ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ, ఈ విషయాన్ని తెలియజేశారు.
“మహిళా శక్తీకరణకు సీఎం చంద్రబాబు పూర్తిస్థాయిలో కృషి చేస్తున్నారు. ప్రతి ఇంటి నుంచి ఒక్క మహిళను పారిశ్రామిక వేత్తగా తీర్చిదిద్దాలన్నదే ఆయన లక్ష్యం. అన్న ఎన్టీఆర్ స్ఫూర్తితో మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి,” అని మంత్రి పేర్కొన్నారు.
మాజీ ప్రభుత్వం (2019-24) మహిళల సంక్షేమాన్ని పట్టించుకోలేదని విమర్శించిన ఆమె, చంద్రబాబు మరోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల అభ్యున్నతికి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారని చెప్పారు.
ఈ క్రమంలోనే ఏపీ బీసీ కో-ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 2025-26 సంవత్సరానికి ఉచిత టైలరింగ్ శిక్షణ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. 90 రోజుల పాటు శిక్షణ ఇచ్చి, కోర్సు పూర్తి చేసిన వారికి కుట్టు మిషన్ ఉచితంగా అందించడంతో పాటు సర్టిఫికెట్ కూడా ఇస్తున్నట్టు చెప్పారు.
శిక్షణ కార్యక్రమానికి మహిళల నుంచి మంచి స్పందన వస్తోందని, హాజరు నమోదు కోసం ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ (ఎఫ్‌ఆర్‌ఎస్) ఉపయోగిస్తున్నామని పేర్కొన్నారు. టైలరింగ్ శిక్షణ పొందిన మహిళలకు ఉపాధి కల్పించేందుకు పలు గార్మెంట్ సంస్థల యాజమాన్యాలతో చర్చలు జరుపుతున్నామని, ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ సంస్థతో కలిసి ముందుకెళ్తున్నామని మంత్రి సవిత వివరించారు.










