
ఉండవల్లి :-తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేసి వచ్చే ఎన్నికల్లో ఘన విజయం సాధించి చరిత్ర తిరగరాయాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులపై ఉందని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పష్టం చేశారు.
ఉండవల్లి నివాసంలో నూతనంగా నియమితులైన పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, జోనల్ కోఆర్డినేటర్లతో నిర్వహించిన సమావేశంలో మంత్రి లోకేష్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా నూతన బాధ్యతలు స్వీకరించిన నాయకులకు శుభాకాంక్షలు తెలిపారు.
మంత్రి లోకేష్ మాట్లాడుతూ…
“మనందరిదీ సింగిల్ లైన్, సింగిల్ అజెండా కావాలి. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబునాయుడు గారే మన నాయకుడు. మిగతావారంతా పార్టీ సైనికులే. నాతో సహా ప్రతి ఒక్కరూ పార్టీ కోసం పనిచేసే సైనికులమే” అని పేర్కొన్నారు.
పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలు తప్పనిసరిగా అమలు చేయాలి
పార్టీ ఇచ్చే ప్రతి కార్యక్రమాన్ని తూచా తప్పకుండా అమలు చేయాలని, సమస్యలు ఎదురైతే బాధ్యత తీసుకుని పరిష్కారానికి కృషి చేయాలని లోకేష్ సూచించారు. తాను ఎప్పుడూ అందుబాటులో ఉంటానని, ఇంఛార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేలు, జోనల్ కోఆర్డినేటర్లతో సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలని చెప్పారు.
ప్రతి నియోజకవర్గంలో ప్రజాదర్బార్‌లు, కార్యకర్తల సమావేశాలు నిర్వహించాల్సిన బాధ్యత నాయకులపై ఉందని, జిల్లా నుంచి బూత్ స్థాయి వరకు అన్ని కమిటీలను పూర్తిచేయాలని ఆదేశించారు. కేలండర్ ప్రకారం సమీక్షా సమావేశాలు నిర్వహించి పనితీరును మెరుగుపరచాలని సూచించారు.
చరిత్ర తిరగరాయాల్సిన సమయం వచ్చింది
“1999లో మాత్రమే పార్టీ వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చింది. ఆ చరిత్రను తిరగరాయాల్సిన బాధ్యత ఇప్పుడు మనపై ఉంది. సొంతిల్లు కంటే కిరాయి ఇల్లుపై దృష్టి పెట్టడం మానేయాలి. ఇచ్చిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలి. మూడు నెలలకు ఒకసారి పనితీరుపై సమీక్ష ఉంటుంది” అని లోకేష్ స్పష్టం చేశారు.
పార్టీ అనేది వ్యవస్థ – వ్యక్తులు కాదు
పార్టీ వ్యవస్థగా పనిచేయాలని, వ్యక్తులపై ఆధారపడకూడదని లోకేష్ తెలిపారు. సాంకేతికతను వినియోగించుకోవాలని, మై టీడీపీ యాప్ ద్వారా ఇచ్చే డైరెక్షన్లను తప్పకుండా అమలు చేయాలని సూచించారు. ఉత్తమంగా పనిచేసే కార్యకర్తలను గుర్తించి నామినేటెడ్ పదవులు ఇచ్చామని, పార్టీ ప్రతి కార్యకర్తను గౌరవిస్తుందని చెప్పారు.
మంగళగిరి నియోజకవర్గం విజయానికి ఉదాహరణగా నిలుస్తోందని పేర్కొన్నారు.
మున్ముందు స్పీడ్ పెంచుతాం
పార్టీ కోసం తాను పూర్తి స్థాయిలో సమయం కేటాయిస్తానని, అందరూ కలిసి పార్టీని మరింత బలోపేతం చేయాలని లోకేష్ పిలుపునిచ్చారు. చంద్రబాబునాయుడు గారు 75 ఏళ్ల వయసులోనూ కార్యకర్తలను స్వయంగా కలిసి సమస్యలు తెలుసుకుంటున్నారని ప్రశంసించారు.
కూటమి పార్టీలతో సమన్వయం అవసరమని, నెలకోసారి సమావేశాలు నిర్వహించాలని సూచించారు. సోషల్ మీడియాపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, వచ్చే ఏడాది సభ్యత్వ కార్యక్రమానికి ఇప్పటినుంచే సిద్ధంగా ఉండాలని తెలిపారు.Guntur Local News
కార్యకర్తే పార్టీ అధినేత
“తెలుగుదేశం పార్టీకి కార్యకర్తే అధినేత. ఒక్కసారి పార్టీ నిర్ణయం తీసుకుంటే దాన్ని తూచా తప్పకుండా అమలు చేయాలి. పార్టీ కార్యాలయాల నిర్మాణంపైనా ప్రత్యేక దృష్టి పెట్టాలి” అని మంత్రి లోకేష్ అన్నారు.
ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, జోనల్ కోఆర్డినేటర్లు మంతెన సత్యనారాయణ రాజు, భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, బీద రవిచంద్ర యాదవ్, సుజయ్ కృష్ణ రంగారావు, దీపక్ రెడ్డి, కోవెలమూడి రవీంద్ర, వేపాడ చిరంజీవి రావు, మందలపు రవి, పెళ్లకూరు శ్రీనివాస రెడ్డి తదితరులు పాల్గొన్నారు.










