
బాపట్ల, అక్టోబర్ 17:-జిల్లా ప్రజలు బాపట్ల షాపింగ్ సందడిని పూర్తిగా వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ డా. వి. వినోద్ కుమార్ పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక టీటిడీ కళ్యాణ మండపంలో జరిగిన సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో ఆయన పాల్గొని వివిధ స్టాల్స్‌ను పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మరింత లాభం చేకూరేలా సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్ కార్యక్రమాన్ని విస్తృతంగా అమలు చేస్తోందని తెలిపారు. ఈ నెల 13వ తేదీ నుండి 19వ తేదీ వరకు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

బాపట్ల షాపింగ్ సందడిలో నిత్యావసర వస్తువులు, ఎలక్ట్రానిక్ వస్తువులు, మోటార్ వాహనాలు వంటి విభాగాలకు సంబంధించిన స్టాల్స్ ఏర్పాటు చేశారని తెలిపారు. శనివారం, ఆదివారం రెండు రోజుల పాటు షాపింగ్ సందడి కొనసాగుతుందని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.జీఎస్టీ తగ్గింపుతో పాటు వస్తువులపై ప్రత్యేక డిస్కౌంట్‌లు కూడా అందిస్తున్నారని కలెక్టర్ వివరించారు.
ఇప్పటికే రైతులు ట్రాక్టర్లు, కొందరు కార్లు కొనుగోలు చేశారని, ప్రజలు నిత్యవసర వస్తువులు పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారని చెప్పారు. దీపావళి వేడుకలు బాపట్లలో ముందుగానే ప్రారంభమైనట్లు ఉందని ఆయన హాస్యంగా వ్యాఖ్యానించారు.ఆదివారం జిల్లా కేంద్రంలో “హ్యాపీ సండే” కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఆనందంగా గడపాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా కలెక్టర్ స్వయంగా కొన్ని వస్తువులను కొనుగోలు చేశారు. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించగా, వాటిలో పాల్గొన్న కళాకారులను కలెక్టర్ మెమెంటోలు, శాలువాలతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి పి. గ్లోరియా, మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి విజయమ్మ, సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ నాగిరెడ్డి, స్టేట్ టాక్స్ డిప్యూటీ కమిషనర్ మురళీకృష్ణ, అసిస్టెంట్ కమిషనర్ గ్లోరీ కుమారి, సిబ్బంది సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
 
  
 






