
మంగళగిరి, అక్టోబర్ 29:-మంగళగిరి శ్రీలక్ష్మినరసింహస్వామి ఆలయ ప్రాంగణంలోని కళ్యాణం గ్రౌండ్‌లో నవంబర్ 4వ తేదీ సాయంత్రం 6 గంటలకు అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమం ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ సహకారంతో జరగనుంది.బుధవారం శ్రీలక్ష్మినరసింహస్వామి దేవస్థానం ఆవరణలో నియోజకవర్గ గురుస్వాములు, నిర్వాహకులు సన్నాహక సమావేశం నిర్వహించి పడిపూజ ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా గురుస్వాములు మాట్లాడుతూ, నవంబర్ 4న జరిగే ఈ మహోత్సవానికి మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు.శ్రీ మధు నంబూద్రి గురుస్వామి ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వామికి ప్రత్యేక అలంకరణలతోపాటు 18 పడిమెట్ల వద్ద కర్పూర దీపాలు వెలిగించి పూజలు జరపనున్నారు. సంప్రదాయబద్ధంగా నిర్వహించే ఈ పడిపూజలో డప్పు శ్రీను భజన బృందం ఆకట్టుకునే భజనలు ప్రదర్శించనుంది. “స్వామియే శరణం అయ్యప్ప… శరణంశరణం అయ్యప్ప…” అంటూ అయ్యప్ప నామస్మరణతో మంగళగిరి పట్టణం మార్మోగేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
పడిపూజ అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు అందజేయడంతో పాటు అన్నప్రసాద వితరణ కూడా ఉంటుంది. గురుస్వాములు, భవానీలు, భక్తులు పెద్ద ఎత్తున ఈ మహోత్సవానికి హాజరవ్వనున్నారని నిర్వాహకులు తెలిపారు.మంత్రి నారా లోకేష్ సహకారంతో మంగళగిరిలో జరుగుతున్న ఈ అయ్యప్ప స్వామి పడిపూజ భక్తులకు విశేష ఆనందాన్ని కలిగిస్తోందని వారు పేర్కొన్నారు. అయ్యప్ప స్వామి ఆశీర్వాదాలతో ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలని, నియోజకవర్గం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని కోరుకున్నారు.“మాలధారణతో 41 రోజుల దీక్ష పూర్తిచేసి ఇరుముడి కట్టుకున్న స్వాములు శబరిమలై యాత్రకు సిద్ధమవుతున్నారు. అయ్యప్ప స్వామి దివ్యకృప మంగళగిరి ప్రజలపై సదా నిలిచి ఉండాలని కోరుకుంటున్నాం,” అని గురుస్వాములు తెలిపారు.







