ఆంధ్రప్రదేశ్

GUNTUR..మొబైల్ ఫోన్‌లోనే అన్ని ధృవ‌ప‌త్రాలు..ఆర్టీజీ శాఖ కార్య‌ద‌ర్శి భాస్క‌ర్ కాటంనేని

రాబోయే రోజుల్లో పౌరులు త‌మ‌కు సంబంధించిన‌ ధృవీక‌ర‌ణ ప‌త్రాలేవీ భౌతికంగా తీసుకెళ్లాల్సిన అవ‌స‌రం ఉండ‌బోద‌ని, త‌మ మొబైల్ ఫోన్లోనే అన్ని ప‌త్రాలు డిజిట‌ల్ రూపేణా పొందుప‌ర‌చ‌వ‌చ్చ‌ని, ఆ దిశ‌గా ప్ర‌భుత్వం ప‌ని చేస్తోంద‌ని రాష్ట్ర ఐటీ మ‌రియు ఆర్టీజీ శాఖ కార్య‌ద‌ర్శి భాస్క‌ర్ కాటంనేని తెలిపారు. దీనికోసం ప్ర‌తి పౌరుడికి ప్ర‌త్యేకంగా డిజీ లాక‌ర్ స‌దుపాయం క‌ల్పించున్నామ‌న్నామ‌ని వెల్ల‌డించారు. ప్ర‌భుత్వంలోని వివిధ శాఖ‌ల మ‌ధ్య డేటా అనుసంధాన ప్ర‌క్రియ గురించి అన్నీ శాఖ‌లు, విభాగాధిపతుల‌తో రియ‌ల్ టైమ్ గ‌వ‌ర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్‌) శుక్రవారం స‌చివాల‌యంలో స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించింది. ఈ స‌మావేశంలో భాస్క‌ర్ కాటంనేని మాట్లాడుతూ ప్ర‌భుత్వంలో ఇప్ప‌టికీ కూడా ఒక సింగిల్ సోర్స్ ఆఫ్ డేటా అనేది లేద‌న్నారు. ఆయా శాఖ‌ల్లో చాలా డేటా ఉన్న‌ప్ప‌టికీ అది ఇప్ప‌టికి కూడా ఒక‌చోట అనుసంధానం కాలేద‌ని, దానివ‌ల్ల పౌరుల‌కు ప్ర‌భుత్వం అందించే సేవ‌లు మ‌రింత స‌మ‌ర్థ‌వంతంగా అందించ‌డానికి సాంకేతిక అవ‌రోధాలు ఏర్ప‌డుతున్నాయ‌న్న్నారు. ప్ర‌జ‌లు కార్యాల‌యాల చుట్టూ తిరిగేప‌ని లేకుండా పౌరుల‌కు వారికి కావాల్సిన అన్ని సేవ‌లు వారి చేతిలోని మొబైల్ ఫోన్ ద్వారానే అందించాల‌న్న‌ది ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ఆశ‌య‌మ‌న్నారు. ప్ర‌భుత్వ ఆశ‌యాల‌కు అనుగుణంగా ఆర్టీజీఎస్ ఒక పెద్ద డేటా లేక్‌ను ఏర్పాటు చేస్తోంద‌న్నారు. దీనిద్వారా రాష్ట్ర ప్ర‌భుత్వంలోని అన్ని శాఖ‌ల్లో ఉన్న డేటాను ఈ డేటా లేక్‌తో అనుసంధానం చేస్తామ‌ని, త‌ద్వారా పౌరుల‌కు డిజిట‌ల్ సేవ‌లు మ‌రింత మెరుగ్గా అందించే స‌దుపాయం క‌ల్పిస్తామ‌న్నారు.

స్మార్ట్ ఫోన్ లోనే అన్ని స‌ర్టిఫికెట్లు

పౌరులెవ్వ‌రు కూడా త‌మ‌కు ప్ర‌భుత్వం నుంచి కావాల్సిన స‌ర్టిఫికెట్ల కోసం ఏ కార్యాల‌యానికి, ఏ అధికారి వ‌ద్ద‌కు వెళ్ల‌కుండా కేవ‌లం త‌మ వ‌ద్ద ఉన్న సెల్ ఫోన్ ద్వార‌నే ఇట్టే సుల‌భంగా పొందేలా చేయాల‌న్న‌దే ప్ర‌భుత్వ ఆశ‌య‌మ‌న్నారు. ఇందులో భాగంగా ప్ర‌భుత్వం ఇటీవ‌లే వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ ప్రారంభించింద‌న్నారు. దీనికోసం మెటా సంస్థ‌తో ప్ర‌భుత్వం అవ‌గాహ‌న ఒప్పందం చేసుకుంద‌ని తెలిపారు. ప్ర‌స్తుతం వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ ద్వారా 161 సేవలు అందుబాటులో ఉన్నాయ‌న్నారు. రానున్న రోజుల్లో ప్ర‌జ‌ల‌కు కావాల్సిన అన్ని సేవ‌లు, అన్ని ర‌కాల ధృవీక‌ర‌ణ ప‌త్రాలు ఇందులో పొందే స‌దుపాయం క‌ల్పింస్తుంద‌న్నారు. ఒక పౌరుడు త‌న‌కు సంబంధించిన విద్యార్హ‌త‌, కుల, ఆదాయ‌, జ‌న‌న‌, మ‌ర‌ణ త‌దిత‌ర ధృవీక‌ర‌ణ ప‌త్రాల‌న్నీ కూడా వాట్సాప్ ద్వారానే డౌన్ లోడు చేసుకోవ‌చ్చ‌ని ఎవ‌రి వ‌ద్ద‌కు తిర‌గాల్సిన ప‌ని ఉండ‌బోద‌న్నారు. అలాగే రాబోయే రోజుల్లో పౌరులు త‌మ‌కు సంబంధించి స‌ర్టిఫికెట్ల‌ను భౌతికంగా త‌మ‌తో తీసుకెళ్లాల్సిన అస‌వ‌రం ఉండబోత‌ద‌ని, త‌మ చేతిలోని మొబైల్ ఫోన్లోనే ఆ స‌ర్టిఫికెట్ల‌ను డౌన్ లోడు చేసుకుని పొందుప‌ర‌చ‌వచ్చ‌న్నారు. ఆ దిశ‌గా వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ ను ప్ర‌భుత్వం అమ‌లు చేయ‌నున్న‌ద‌న్నారు. ప్ర‌తి పౌరుడికి డిజీ లాక‌ర్ స‌దుపాయం క‌ల్పించి, వారు త‌మ ధృవీక‌ర‌ణ ప‌త్రాలు అందులో భ‌ద్ర‌ప‌ర‌చుకునేలా చేస్తామ‌న్నారు. వాట్సాప్ ద్వారానే పౌరులు చెల్లింపులు కూడా నిర్వ‌హించుకునే స‌దుపాయం క‌ల్పిస్తున్నామ‌న్నారు. వాట్సాప్ ద్వారానే పౌరులు ప్ర‌భుత్వానికి అర్జీలు, ఫిర్యాదులు చేయొచ్చ‌న్నారు. ప్ర‌స్తుతం వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ సేవ‌ల‌ను తెలుగు, ఇంగ్లీషు భాష‌ల్లో అందిస్తున్నామ‌ని, అయితే స‌రిహ‌ద్దు రాష్ట్రాల్లోని జిల్లాల్లో ఉన్న ప్ర‌జ‌ల సౌక‌ర్య‌ర్థం ప్రాంతీయ భాష‌లైన త‌మిళం, ఒరియా, క‌న్న‌డ భాష‌ల్లో కూడా అందించే ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. చ‌దువు రాని పౌరులు తాము నేరుగా వాయిస్ ద్వారానే ప్ర‌భుత్వానికి ఫిర్యాదు, అర్జీలు స‌మ‌ర్పించే అవ‌కాశం కూడా క‌ల్పించ‌డానికి ప్ర‌య‌త్నాలు ప్ర‌భుత్వం చేస్తోంద‌న్నారు. అయితే ఇవ‌న్నీ పౌరుల‌కు మ‌రింత మెరుగ్గా అందించాలంటే శాఖ‌ల మ‌ధ్య డేటా అనుసంధానం వేగ‌వంతంగా జ‌ర‌గాల్సిన అవ‌స‌ర‌ముంద‌ని చెప్పారు.

సీడీటీఓను నియ‌మించుకోండి

ప్ర‌తి శాఖ‌లోనూ ఒక చీఫ్ డేటా టెక్నిక‌ల్ ఆఫీస‌ర్ (సీడీటీఓ)ను నియ‌మించుకోవాల‌ని భాస్క‌ర్ కాటంనేని అధికారుల‌కు సూచించారు. త‌మ శాఖ‌లో అలాంటి వ్య‌క్తిని రెండు రోజుల్లోపు గుర్తించి వారికి ఈ బాధ్య‌త‌లు అప్ప‌జెప్పాల‌న్నారు. అదే విధంగా ఆర్టీజీఎస్ డేటా లేక్ తో ఆయా శాఖ‌లు త‌మ వ‌ద్ద ఉన్న డేటాను షేర్ చేసుకునే ప్ర‌క్రియ వారం రోజుల్లో పూర్తి చేయాల‌ని కోరారు. ఈ స‌మావేశంలో రియ‌ల్ టైమ్ గ‌వ‌ర్నెన్స్ సొసైటీ ముఖ్య కార్య‌నిర్వ‌హ‌ణ‌దాధికారి కె. దినేష్ కుమార్‌, డిప్యూటీ సీఈఓ మాధురి, పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సౌర‌వ్ గౌర్‌, ఐజీ టెక్నిక‌ల్ స‌ర్వీస్ శ్రీకాంత్‌, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ క‌మిష‌న‌ర్ వీర‌పాండ్య‌న్‌, జీఎస్‌డ‌బ్ల్యూ డైరెక్ట‌ర్ శివ‌ప్ర‌సాద్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Author

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button