మంగళగిరి, అక్టోబర్ 10:వ్యాపార మరియు వ్యవసాయ రంగాలకు ఊతమివ్వడమే లక్ష్యంగా, మంగళగిరి పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో శుక్రవారం “సూపర్ జీఎస్టీ సేవింగ్స్” పై అవగాహన కార్యక్రమం జరిగింది. సేల్స్ టాక్స్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో వ్యాపారవేత్తలు, రైతులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.guntur11
కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన జీఎస్టీ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ, సూపర్ జీఎస్టీ విధానంతో వ్యాపారులకు, రైతులకు గణనీయమైన ఉపశమనం లభిస్తోందన్నారు. ముఖ్యంగా విత్తనాలు, ఎరువులు, కీటకనాశకాలు, పశువుల ఆహారం, వ్యవసాయ యంత్రాలు వంటి అవసరమైన వస్తువులపై జీఎస్టీ రేట్లు తగ్గించడముతో రైతులకు ఉత్పత్తి ఖర్చులు తగ్గి లాభదాయకత పెరుగుతోందని వివరించారు.
నగర పాలక సంస్థ కమిషనర్ అలీమ్ భాష మాట్లాడుతూ, “చిన్న మరియు మధ్య తరహా వ్యాపారులు తక్కువ పన్నులతో తమ వ్యాపారాన్ని విస్తరించుకునే అవకాశాన్ని పొందుతున్నారు. అలాగే విద్యుత్ పరికరాలు, వైద్య సరఫరాలు, నిత్యావసర వస్తువులపై పన్ను తగ్గడంతో సామాన్య ప్రజల ఖర్చులు తగ్గాయి” అని పేర్కొన్నారు.
మార్కెట్ యార్డ్ చైర్మన్ జవ్వాది కిరణ్ చంద్ మాట్లాడుతూ, “సూపర్ జీఎస్టీ ద్వారా మార్కెట్ స్థిరత ఏర్పడుతోందని, నాణ్యమైన వస్తువులు తక్కువ ధరలకే అందుబాటులోకి వస్తున్నాయని” పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఎలక్ట్రానిక్ వస్తువులు, నిత్యావసర వస్తువులపై జీఎస్టీ మినహాయింపు, తగ్గుదలలను వివరించే ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథులు ప్రదర్శనను సందర్శించి వివరాలు తెలుసుకున్నారు.
కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ శకుంతల, ఆర్టీఓ బాలకృష్ణ, టీడీపీ నేతలు సంకా బాలాజీ గుప్తా, అల్లక నమశ్శివాయ, రైతు సంఘాల ప్రతినిధులు, మార్కెట్ కమిటీ అధికారులు తదితరులు పాల్గొని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.