ఏలూరులో 42 కంపెనీలతో మెగా జాబ్ మేళా||Mega Job Mela with 42 Companies in Eluru
ఏలూరులో 42 కంపెనీలతో మెగా జాబ్ మేళా
ఏలూరు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని నిరుద్యోగ యువతకు మరోసారి చక్కటి అవకాశాన్ని కల్పిస్తూ మెగా జాబ్ మేళా ఘనంగా నిర్వహించారు.
రాష్ట్ర ప్రభుత్వం రానున్న నాలుగు సంవత్సరాల్లో యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే ప్రధాన లక్ష్యమని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి స్పష్టం చేశారు.
ఈ సమావేశం ఏలూరు పార్లమెంటు సభ్యులు పుట్టా మహేష్ కుమార్ ఆధ్వర్యంలో స్థానిక సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాల సమావేశ మందిరం లో నిర్వహించబడింది.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ, జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి) తదితరులు పాల్గొన్నారు.
ఈ జాబ్ మేళాలో మొత్తం 42 ప్రముఖ కంపెనీలు పాల్గొని 3,500 పైగా ఉద్యోగాలు ఆఫర్ చేశాయి.
కె. వెట్రిసెల్వి మాట్లాడుతూ, నిరుద్యోగ యువతకు అన్ని నియోజకవర్గాల్లో జాబ్ మేళాలు నిర్వహించడం ద్వారా ఇప్పటివరకు 2,400 ఉద్యోగాలు కల్పించామన్నారు.
“రాష్ట్రం మొత్తం లోపల నిరుద్యోగ సమస్యను తగ్గించడానికి ప్రతీ నియోజకవర్గంలో జాబ్ మేళాలను పునరావృతం చేస్తున్నాం.
ఇది నిరంతర ప్రక్రియ కావున, యువత అందరూ వినియోగించుకుని జీవితం ముందుకు తీసుకెళ్లాలి” అని సూచించారు.
సిఆర్ రెడ్డి కళాశాల జాబ్ మేళా కోసం తన వేదికను ఉపయోగించడానికి ముందుకు రావడం అభినందనీయమని కలెక్టర్ అన్నారు.
పార్లమెంటు సభ్యులు పుట్టా మహేష్ కుమార్ మాట్లాడుతూ, “కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్య, ఉపాధి, ఉద్యోగ అవకాశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి.
మొదటగా వచ్చిన జాబు జీవితం మొదటి మెట్టు.
ఒక చిన్న ఉద్యోగం నుంచి ఎదిగి పెద్ద స్థాయికి చేరుకునే అవకాశం ప్రతీ ఒక్కరికీ ఉంటుంది” అని తెలిపారు.
తాను మధ్య తరగతి కుటుంబం నుండి వచ్చి, సివిల్ ఇంజనీరింగ్ చేసి, మొదట చిన్న కంపెనీలో రూ.12వేలు జీతంతో ఉద్యోగం చేసిన అనుభవాన్ని గుర్తుచేశారు.
“ఆ అనుభవంతోనే నేడు నాలుగు వేల కోట్ల టర్నోవర్ కలిగిన గ్రూప్స్‌ని ఏర్పాటు చేయగలిగాను.
ఇది ప్రతి యువకుడికి ప్రేరణ కావాలి” అని అన్నారు.
జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ మాట్లాడుతూ, ఈ జాబ్ మేళా ద్వారా ఎంతోమంది యువత జీవితాల్లో వెలుగులు నింపుతుందని పేర్కొన్నారు.
“చదువుకున్న తర్వాత ఉద్యోగం లభిస్తే కేవలం కుటుంబం మాత్రమే కాదు, సమాజంలో కూడా మంచి గుర్తింపు లభిస్తుంది” అని అన్నారు.
జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ మాట్లాడుతూ, ఈ రోజు ఒక్క ఉద్యోగానికి 100 మంది పోటీ పడుతున్న స్థితిలో 42 కంపెనీల ద్వారా 3,500 పైగా ఉద్యోగాలు కల్పించడం సానుకూల పరిణామమని అన్నారు.
ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి) మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో స్కిల్ డెవలప్‌మెంట్ ద్వారా ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేకపోయారని, ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున అవకాశాలను అందిస్తోందని వివరించారు.
తొలి ప్రయత్నంలో జాబు రాకపోయినా రెండో, మూడో ప్రయత్నంలో తప్పకుండా వస్తుందన్న నమ్మకాన్ని యువతలో పెంచాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఏపీ ట్రైకర్ చైర్మన్ బోరగం శ్రీనివాసులు, హుడా చైర్మన్ పెద్దిబోయిన శివ ప్రసాదు, జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా అధికారి వై. జితేంద్రబాబు, సిఆర్ రెడ్డి కళాశాల సెక్రటరీ డా. యం.బి.యస్.వి. ప్రసాదు, కరస్పాండెంట్ జాస్తి మల్లిఖార్జునుడు, ప్రిన్సిపల్ డా. కె. వెంకటేశ్వరరావు, జిల్లా ప్లేస్మెంట్ అధికారి కె. ప్రవీణ్, జిల్లా నైపుణ్యాభివృద్ధి కో-ఆర్డినేటర్లు వి. రవిశ్యామ్, కె. రాంబాబు, వి. కిషోర్, కార్తీక్, రామకృష్ణ, నాగరాజు, సత్యనారాయణ, శ్యామ్ భూషణ్, వివిధ కంపెనీల ప్రతినిధులు, వారి టెక్నికల్ బృందాలు, నిరుద్యోగ యువత మరియు కుటుంబసభ్యులు పాల్గొన్నారు.
పట్టభద్రులు, సాంకేతిక విద్యావంతులు, ఇంటర్మీడియట్ అర్హత కలిగిన యువత జాబ్ మేళాలో రిజిస్టర్ అయ్యి ఇంటర్వ్యూలలో పాల్గొనడం గమనార్హం.
ఈ జాబ్ మేళా నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు.
రాష్ట్రంలోని యువతకు ఆర్థికంగా ముందుకు వెళ్లే బంగారు భవిష్యత్తుకు ఇది గొప్ప అవకాశమని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.