ఫిరంగిపురం, సెప్టెంబర్ 20: ఫిరంగిపురం మండలం మేరికపూడి గ్రామం సమీపంలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రాజస్థాన్ నుంచి వచ్చిన యాత్రికుల బస్సు గుంటూరు నుంచి శ్రీశైలం దిశగా ప్రయాణిస్తున్న సమయంలో అదుపు తప్పి రోడ్డు పక్కకు జారి బోల్తా పడింది.
స్థానికుల సమాచారం మేరకు బస్సులో సుమారు 50 మంది యాత్రికులు ఉన్నారు. ఈ ఘటనలో కొందరికి స్వల్ప గాయాలు కాగా, ప్రాణనష్టం సంభవించలేదని సమాచారం. గాయపడినవారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్టు తెలుస్తోంది.
వార్త తెలిసిన వెంటనే ఫిరంగిపురం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై వివరాలు సేకరిస్తున్నారు. బస్సు వేగం, డ్రైవర్ అలసట, లేదా రోడ్డు పరిస్థితులు కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా అధికారులు అంచనా వేస్తున్నారు.