
విజయవాడ:-ఖాదీ, గ్రామీణ పరిశ్రమల ఉత్పత్తులకు విస్తృత మార్కెటింగ్ వేదికగా 10 రోజుల పాటు ఖాదీ మహోత్సవాన్ని నిర్వహించనున్నట్లు ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్ రాష్ట్ర సంచాలకులు డా. ఎస్. గ్రీప్ తెలిపారు.
స్థానిక పంట కాలువ రోడ్డులోని మేరీస్ స్టెల్లా ఇండోర్ స్టేడియంలో ఈ నెల 3వ తేదీ శనివారం సాయంత్రం 5 గంటలకు ఎగ్జిబిషన్‌ను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని), తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు పాల్గొంటారని తెలిపారు. జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ, కేవీఐబీ సీఈవో కట్టా సింహాచలం, పరిశ్రమల శాఖ సంచాలకులు శుభం బన్సల్, ఎస్ఎల్బీసీ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ శ్రీనివాస దాస్యం తదితరులు హాజరవుతారని పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులతో 100కు పైగా స్టాళ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఖాదీ వస్త్రాలు, పొందూరు ఖాదీ, ధర్మవరం సిల్క్, కలంకారీ ప్రింటింగ్, చెక్క బొమ్మలు, హస్తకళాకారుల చేతితో తయారైన అనేక రకాల ఉత్పత్తులు సందర్శకులకు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు.
గ్రామీణ కళాకారుల జీవనోపాధిని ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ ఖాదీ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నామని, నగర ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఎగ్జిబిషన్‌ను సందర్శించి కొనుగోలు చేసి చేతివృత్తుల వారికి చేయూతనివ్వాలని డా. ఎస్. గ్రీప్ కోరారు.Vijayawada Localnews
ఈ సందర్భంగా ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్ సహాయ సంచాలకులు ఆర్.ఎల్.ఎన్. మూర్తి మాట్లాడుతూ, పీఎంఈజీపీ పథకం కింద తయారైన ఉత్పత్తులకు ఈ ఎగ్జిబిషన్ ద్వారా మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. తయారీదారులు, కళాకారుల ప్రతిభను ప్రజలకు చేరువ చేసేందుకే ఈ వేదికను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.










