
బాపట్ల: నవంబర్ 10:-మొంథా తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న పంట పొలాలు, కాలువలను జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ సోమవారం పరిశీలించారు. కారంచేడు మండలంలోని పలు ప్రాంతాల్లో జరిగిన పంట నష్టాలు, కాలువలకు గండ్లు, వరద ముప్పు పరిస్థితులను ఆయన ప్రత్యక్షంగా చూశారు.మొదటగా కారంచేడు గ్రామ పరిసరాల్లోని దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించిన కలెక్టర్, అనంతరం కొమ్మూరు కాలువకు గండి పడిన ప్రాంతాన్ని పరిశీలించి సంబంధిత అధికారులకు తక్షణ మరమ్మతుల సూచనలు చేశారు. అనంతరం స్వర్ణ గ్రామంలో స్వర్ణ కాలువ పొంగి కొమ్మూరు కెనాల్లో కలిసిన ప్రాంతం, అలాగే కప్పల వాగు, పర్చూరు వాగుల్లో గండ్లు పడిన ప్రదేశాలను పరిశీలించారు.

జిల్లాలో మొంథా తుఫాను కారణంగా నష్టపోయిన ప్రాంతాలను పరిశీలించేందుకు మంగళవారం జిల్లా పర్యటనకు రానున్న కేంద్ర బృందం సందర్శనకు సంబంధించి సమగ్ర రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఎస్సీ వెంకటరత్నం, డ్రైనేజీ ఈఈ మురళీకృష్ణ, కారంచేడు తహసీల్దార్ నాగరాజు, ఎంపీడీవో, ఇరిగేషన్, డ్రైనేజీ శాఖ డీఈలు, ఏఈలు తదితరులు పాల్గొన్నారు.







