
అమరావతి, అక్టోబర్ 29:రాష్ట్రాన్ని వణికిస్తున్న ‘మొంథా’ తుపాను నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పరిస్థితిని సమీక్షించారు. తుపాను తీరం దాటినప్పటికీ పలు జిల్లాల్లో ఇంకా తీవ్ర వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో, ప్రభావిత ప్రాంతాల పరిస్థితిపై పవన్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.డిప్యూటీ సీఎం తుపానుతో తీవ్రంగా ప్రభావితమైన డా.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల కలెక్టర్ల నుంచి వివరాలు సేకరించారు. తుపాను ప్రభావంతో విస్తృతంగా దెబ్బతిన్న విద్యుత్ సరఫరా వ్యవస్థను తక్షణం పునరుద్ధరించాలంటూ అధికారులను ఆదేశించారు.
పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందిన ప్రజలకు వసతి, ఆహారం సక్రమంగా అందేలా చూడాలని సూచించారు. నదులు ఉద్ధృతంగా ఉన్న ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలని, వరద ప్రభావిత ప్రాంతాల్లో రహదారులు, వంతెనలపై గమనించమని సూచించారు.వర్షాల అనంతరం పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన ఆదేశించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను వేగవంతం చేసి, అవసరమైన చోట రక్షణ బృందాలను సమన్వయం చేయాలని పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు.సమావేశంలో ఆయన మాట్లాడుతూ, “ప్రజల భద్రతే ప్రాధాన్యం. అధికారులు పూర్తిస్థాయిలో క్షేత్రస్థాయిలో ఉండాలి. సహాయక చర్యల్లో నిర్లక్ష్యం సహించం,” అని హెచ్చరించారు.







