
Bapatla:చినగంజం:28-11-25:- మండలంలో వెలుగు డీఆర్‌డీ ఆధ్వర్యంలో వివిధ పథకాల కింద ఆర్థిక సహాయాల పంపిణీ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీడీవో ధనలక్ష్మి, గ్రామ సర్పంచి వై. నారాయణరావు హాజరయ్యారు.బ్యాంక్ ఆఫ్ బరోడా, చింతగుంపల బ్రాంచ్ ద్వారా మొత్తం రూ.25 లక్షల 50 వేల రూపాయలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అందులో భాగంగా PMEGP పథకం కింద ధారా విజయలక్ష్మికి డీజే యూనిట్ స్థాపన కోసం రూ.10 లక్షల రుణం మంజూరు కాగా, అందులో రూ.3.50 లక్షలు సబ్సిడీగా లభించనున్నట్లు అధికారులు తెలిపారు. మిగిలిన రూ.6.50 లక్షలు లబ్ధిదారులు చెల్లించాల్సి ఉంటుంది.

అదే విధంగా, బెజ్జం రమాదేవికి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ యూనిట్ కోసం రూ.5 లక్షలు PMEGP కింద ఆమోదం లభించింది. ఇందులో రూ.1,75,000 సబ్సిడీగా అందనున్నట్లు ఎంపీడీవో ధనలక్ష్మి వెల్లడించారు.అలాగే మరో ఐదుగురు లబ్ధిదారులకు ముద్ర పథకం కింద మొత్తం రూ.10 లక్షల 50 వేల రుణాలను మంజూరు చేశారు.
ఈ సందర్భంగా ఎంపీడీవో ధనలక్ష్మి మాట్లాడుతూ, “యువత స్వయం ఉపాధి దిశగా అడుగులు వేయడానికి ఈ పథకాలు ఎంతో దోహదపడతాయి. మన ప్రాంత యువత ఈ అవకాశాలను వినియోగించుకోవాలి” అని సూచించారు.గ్రామ సర్పంచి వై. నారాయణరావు మాట్లాడుతూ, “మా గ్రామంలో యువత అభివృద్ధికి ప్రభుత్వం ఇలాంటి మంచి అవకాశాలు కల్పించడం అభినందనీయం. లబ్ధిదారులు ఈ సహాయాలను సద్వినియోగం చేసుకొని స్వావలంబన దిశగా ముందుకు సాగాలి” అని అన్నారు.







