
బాపట్ల:అప్పికట్ల : నవంబర్ 7:-రైతు నాయకుడు, స్వాతంత్ర్య సమరయోధుడు ఆచార్య ఎన్‌జీ రంగా చేసిన సేవలు అమూల్యమైనవని బాపట్ల పార్లమెంట్ సభ్యులు మరియు లోక్‌సభ ప్యానెల్ స్పీకర్ తెన్నేటి కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు.ఏన్‌జీ రంగా 125వ జయంతి సందర్భంగా శుక్రవారం ఉదయం బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మతో కలిసి అప్పికట్ల గ్రామంలో ఎన్‌జీ రంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఎంపీ మీడియాతో మాట్లాడుతూ, “1900 నవంబర్ 7న నిండ్రబ్రోలు గ్రామంలో జన్మించిన ఆచార్య రంగా గారు బాపట్ల పార్లమెంట్ మరియు శాసన సభ్యులుగా పనిచేశారు. లోక్‌సభ, రాజ్యసభల్లో విశిష్ట సేవలు అందించారు. మహాత్మా గాంధీతో కలిసి స్వాతంత్ర్య ఉద్యమంలో బ్రిటిష్ పాలకులపై పోరాటం చేశారు,” అని తెలిపారు.
అలాగే ఆయన రైతు ఉద్యమ పితామహుడిగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారని, రైతుల సంక్షేమం కోసం జీవితాంతం కృషి చేశారని ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్ తెలిపారు.రైతు సేవలకు గుర్తుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్‌జీ రంగా పేరుతో వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని స్థాపించడం గర్వకారణమని పేర్కొన్నారు.







