మంగళగిరి: 10-10-2025 :-రాష్ట్రంలో నకిలీ మద్యం అంతకంతకూ పెరిగిపోతుంటే, పేదల ఆరోగ్యానికి ఆశగా ఉన్న ఆరోగ్యశ్రీ పథకాన్ని నిలిపివేయడమేంటని మంగళగిరి నియోజకవర్గ వైసిపి సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
“రాష్ట్రంలో వైద్యం లేదు… త్రాగునీరు లేదు… కానీ నకిలీ మద్యం మాత్రం ఎక్కడైనా దొరుకుతోంది. ఈ నకిలీ మద్యం వల్ల ఇప్పటికే అనేకమంది తమ ప్రాణాలు కోల్పోయారు,” అని వేమారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
“కూటమి ప్రభుత్వానికి చల్లని చూపు ఉంటే… నకిలీ మద్యం కేంద్రాలు ఎక్కడైనా ప్రారంభించవచ్చు,” అంటూ ఎద్దేవా చేశారు. కేవలం 10 లక్షల రూపాయల పెట్టుబడితో నకిలీ మద్యం కేంద్రం ప్రారంభించవచ్చని అధికారంగా నిరూపించినట్లు చెప్పారు.
రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఇలాంటి కేంద్రాలను అధికారులు గుర్తించారని వెల్లడించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి, నకిలీ మద్యం నిర్మూలనకు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ఆరోగ్యశ్రీ పథకం నిలిపివేతపై తీవ్ర నిరసన వ్యక్తం చేసిన వేమారెడ్డి, “పేదవాడి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం తగదు. మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం వేలాది పేదల ప్రాణాలను కాపాడింది. ఆ పథకాన్ని నిలిపివేయడం అంటే పేద ప్రజల ప్రాణాలతో ఆడుకోవడమే,” అని అన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తక్షణమే ఆరోగ్యశ్రీ పథకాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.