
విజయవాడ, అక్టోబర్ 13:ఆంధ్రప్రదేశ్‌లో నకిలీ మద్యం కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న జనార్ధన్ రావు తాజాగా విడుదల చేసిన వీడియో ద్వారా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వీడియోలో ఆయన వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ పై తీవ్రమైన ఆరోపణలు చేశారు.జనార్ధన్ రావు తెలిపిన వివరాల ప్రకారం, వైసీపీ పాలనలో జోగి రమేష్ ఆధ్వర్యంలోనే నకిలీ మద్యం తయారీ మొదలైంది. “ఈ ఏడాది ఏప్రిల్ నెలలో జోగి రమేష్ నాకు కాల్ చేసి, నకిలీ మద్యం తయారీ మళ్లీ ప్రారంభించమని చెప్పారు. ముఖ్యంగా టీడీపీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయాలనే ఉద్దేశంతో ఈ చర్యకు ప్రోత్సహించారు” అని జనార్ధన్ ఆరోపించారు.
తాను ముందుగా తంబళ్లపల్లె నియోజకవర్గంలో లిక్కర్ షాపులు తీసుకున్న విషయాన్ని వెల్లడించిన ఆయన, “అక్కడి నుంచే మిషన్లు, మద్యం తయారీకి అవసరమైన సదుపాయాలు ఏర్పాటు చేశాం. ఇబ్రహీంపట్నం లో కూడా ఇదే తరహా ఏర్పాట్లు చేశాం. జోగి రమేష్ సూచనలతోనే ముందే సాక్షి మీడియాను అక్కడికి తీసుకురాగా, ప్రభుత్వం చెడుగా ప్రసారమయ్యేలా ప్లాన్ చేశారు” అని అన్నారు.“ఈ మొత్తం వ్యవహారాన్ని జోగి రమేష్ స్కెచ్ వేశాడు. చివరికి నన్ను మోసం చేశాడు. బెయిల్ ఇప్పిస్తానని చెప్పి చేతులు దులుపుకున్నారు. నా తమ్ముడినీ ఈ కుట్రలో ఇరికించాడు. జై చంద్రారెడ్డి పేరు తీస్తూ మాయ మాటలతో నన్ను ఉపయోగించుకున్నారు” అని వెల్లడించారు.జనార్ధన్ రావు తెలిపిన ఆరోపణలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. ఆయన “నిజం బయటపెట్టాలనే ఉద్దేశంతోనే ఈ వీడియోను రిలీజ్ చేస్తున్నాను” అంటూ తన ప్రసంగాన్ని ముగించారు.ఈ ఆరోపణలపై ఇప్పటివరకు జోగి రమేష్ నుంచి స్పందన రాలేదు. రాజకీయంగా ఈ వ్యవహారం ఎంత దూరం వెళ్తుందో చూడాల్సి ఉంది.







