బాపట్ల: 30.10.2025:-తుఫాను ప్రభావంతో ఉధృతంగా ప్రవహిస్తున్న నల్లమడ వాగు పరిస్థితిని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ స్వయంగా పరిశీలించారు. గురువారం ఆయన అప్పికట్ల రెవెన్యూ డివిజన్, జిల్లెలమూడి, మూలపాలెం పరిసర ప్రాంతాల్లో నల్లమడ వాగు ప్రవాహాన్ని సమీక్షించారు.డ్రైనేజీ శాఖ అధికారులు కలెక్టర్‌కు వివరించిన వివరాల ప్రకారం, నల్లమడ వాగులో సుమారు 42 వేల క్యూసెక్కుల వరద నీరు ప్రవహిస్తుండగా, ప్రవాహం ప్రస్తుతం నిలకడగా ఉందని తెలిపారు. తాహసిల్దార్ సలీమా, డ్రైనేజీ డి.ఈ ధనలక్ష్మి మ్యాప్ ద్వారా వాగు తీర గ్రామాల వివరాలను కలెక్టర్‌కు వివరించారు.జిల్లెలమూడి డబుల్ లైన్ వంతెన వద్ద వాగు ప్రవాహాన్ని పరిశీలించిన కలెక్టర్, వాగు నీరు ఇరిగేషన్ పంట కాలువల్లోకి చేరుతున్న ప్రాంతాలను స్వయంగా చూసి పరిశీలించారు. ఇరిగేషన్ శాఖ అధికారులు వివరించిన ప్రకారం, పంట కాలువ 13.3 కిలోమీటర్ల పొడవున ప్రవహించి ఈస్ట్ తుంగభద్ర కెనాల్‌లో కలుస్తుందని తెలిపారు.
కలెక్టర్ మాట్లాడుతూ —
“ఇరిగేషన్ కెనాల్ మార్గంలోని అన్ని సుయిస్‌లను తెరచి నీటిని సురక్షితంగా మళ్లించండి. నీరు పొలాల్లోకి ప్రవహించకుండా తగు జాగ్రత్తలు తీసుకోండి. వాగు కరకట్ట బలహీనంగా ఉన్న ప్రాంతాలను వెంటనే బలోపేతం చేయండి,” అని ఆదేశించారు.డ్రోన్ల సహాయంతో జిల్లెలమూడి గ్రామ పరిసర ప్రాంతాల్లో వరద ప్రవాహాన్ని కలెక్టర్ పరిశీలించారు.“నీటి ఉధృతి పెరిగితే గ్రామం ముంపుకు గురయ్యే అవకాశం ఉంది. ప్రజలు ముందస్తు చర్యగా పునరావాస కేంద్రాలకు వెళ్లాలి,” అని గ్రామస్థులను అప్రమత్తం చేశారు.
గ్రామస్తులు కలెక్టర్‌కు 4 లాకులు శిథిలావస్థలో ఉన్నాయని, వాటి కారణంగా నీరు గ్రామంలోకి వస్తోందని వివరించగా, కలెక్టర్ వెంటనే లాకుల పునరుద్ధరణకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, అత్యవసర మరమ్మతులు చేపట్టాలని డ్రైనేజీ శాఖ అధికారులకు సూచించారు. అనంతరం ఆయన శ్రీ విశ్వ జనని పరిషత్ ప్రాంగణంలోని పునరావాస కేంద్రాన్ని కూడా పరిశీలించారు.తరువాత కలెక్టర్ మూలపాలెం గ్రామపంచాయతీ వద్ద ప్రవహిస్తున్న వాగు మరియు పంట కాలువ ప్రవాహాన్ని పరిశీలించి, గ్రామ ప్రజలతో మాట్లాడారు.గ్రామస్థులు వివరించిన ప్రకారం, వాగు ప్రవాహం వలన పొలాలు నీటమునిగినా గ్రామానికి ఎటువంటి ప్రమాదం లేదని తెలిపారు.
కలెక్టర్ మాట్లాడుతూ —
“వరద నీరు తగ్గిన తర్వాత పంట నష్టాలను అంచనా వేసి పరిహారం అందించే చర్యలు తీసుకుంటాం,” అని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో బాపట్ల మండల ప్రత్యేక అధికారి మరియు బీసీ సంక్షేమ శాఖ అధికారి శివలీల, డ్రైనేజీ డి.ఈ ధనలక్ష్మి, తహసిల్దార్ సలీమా, ఇరిగేషన్ శాఖ అధికారులు, ఎంపీడీవో తదితరులు పాల్గొన్నారు.