నషా ముక్త్ భారత్ అభియాన్: మాదకద్రవ్యాలను నిర్మూలించేందుకు కఠిన చర్యలు – ఎస్పీ ఆర్||Nasha Mukt Bharat Abhiyan: Strict Action to Eradicate Drugs, Says SP R. Gangadhara Rao
నషా ముక్త్ భారత్ అభియాన్: మాదకద్రవ్యాలను నిర్మూలించేందుకు కఠిన చర్యలు – ఎస్పీ ఆర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల మేరకు, రాష్ట్ర డీజీపీ హరీష్ గుప్తా ఆదేశాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా “నషా ముక్త్ భారత్ అభియాన్” కార్యక్రమం వేగంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో ఈరోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ ఆర్. గంగాధరరావు ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల నిర్మూలనపై ప్రతిజ్ఞ కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఎస్పీతో పాటు ఏఆర్ అదనపు ఎస్పీ సత్యనారాయణ, ఇతర ఉన్నతాధికారులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. అందరూ కలసి మాదకద్రవ్యాలను సమూలంగా నిర్మూలించేందుకు, యువతను మత్తు పదార్థాల దారిలోకి వెళ్లనీయకుండా కృషి చేయాలనే ప్రతిజ్ఞ చేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ ఆర్. గంగాధరరావు మాట్లాడుతూ, “మాదకద్రవ్యాలు సమాజానికి ముప్పు, ముఖ్యంగా యువత భవిష్యత్తుకు పెద్ద ప్రమాదం. డ్రగ్స్‌కు బానిసై చాలా మంది తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. డబ్బుల కోసం నేరాలు, హత్యలు సైతం చేస్తున్నారు” అని ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రుల కలలు చిద్రమవుతున్నాయని, మత్తు పదార్థాల వాడకం వల్ల మానసిక, శారీరక అనారోగ్యాలు, ప్రాణాంతక వ్యాధులు తలెత్తుతున్నాయని తెలిపారు.
“డ్రగ్స్ ఎక్కడ లభిస్తున్నాయో, వాటి మూలాలను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటాం. గంజాయి విక్రయం, నిల్వ, పంపిణీ ఎక్కడైనా ఉన్నా పోలీసు యంత్రాంగం దాడులు చేస్తుంది. ప్రజల సహకారం అత్యవసరం. మత్తు పదార్థాలకు ‘నో’ చెప్పేలా సమాజం ముందుకు రావాలి” అని ఎస్పీ అన్నారు.
మాదకద్రవ్యాల గురించి సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని భరోసా ఇచ్చారు. “మత్తు పదార్థాలు యువతలో ఆలోచన, విచక్షణా శక్తిని నశింపజేస్తాయి. ఇది కేవలం వ్యక్తిగత సమస్య కాదు, సమాజానికి ముప్పు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండి, పోలీసులకు సమాచారం ఇవ్వాలి” అని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కల్పిస్తూ ప్రత్యేక శిబిరాలు, సమావేశాలు నిర్వహించాలనే నిర్ణయం తీసుకున్నారు. యువతను తప్పుదారిలోకి వెళ్లకుండా, సమాజంలో అవగాహన పెంచేలా పోలీసు విభాగం మరింత కఠిన చర్యలు చేపట్టనుంది.