ఆంధ్రప్రదేశ్

AP NEWS: స్వచ్చాంధ్ర లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి – అభివృద్ధి-సంక్షేమం-సుపరిపాలనతో ముందుకెళ్తున్నాం

AP CM CHANDRABABU PROGRAMME

స్వచ్చాంధ్ర లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. పర్యావరణ పరిరక్షణకు అందరూ కృషి చేయాలి. ఇళ్లతో పాటు మన చుట్టూ ఉన్న పరిసరాలు, స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగ ప్రదేశాలు, ప్రార్థనా మందిరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. గత పాలకులు రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు. రూ. 10 లక్షల కోట్ల అప్పుభారం ప్రజలపై మోపారు. రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నామని, ప్రజల సహకారంతో ఏపీని అభివృద్ధి పథంలో నడిపిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. గత పాలకుడు ఐదేళ్లలో కనీసం మట్టి కూడా తీయలేదు. 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను మనకు వారసత్వంగా ఇచ్చారు. స్వచ్చత, పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ కోసం ఉద్యమం చేయాలి. తణుకులో కూరగాయల మార్కెట్ చూశాను. మిగిలిన కూరగాయలు అక్కడే ఉంచడంతో కుళ్లి పోయి పరిసరాలు కలుషితం అవుతున్నాయి. వేస్ట్ టూ ఎనర్జీ కింద కంపోస్ట్ తయారు చేసే టెక్నాలజీ వచ్చింది. రోజుకు ఒక టన్ను చెత్త వేస్తే కంపోస్టు తయారవుతుంది. నేను ప్రతి నెలా మూడో శనివారం స్వచ్చాంధ్ర కార్యక్రమం పెట్టాను. సమాజం కోసం పనిచేయండి. మన ఆరోగ్యం కాపాడే మున్సిపల్ కార్మికులను నా పక్కన కూర్చోబెట్టుకున్నాను. వారిని ప్రతి ఒక్కరూ గౌరవించాలి. మన్సిపల్ కార్మికులను ఆదుకునే బాధ్యత మేము తీసుకుంటాము. ఇంట్లో చెత్త బయట వేసి పరిసరాలు కలుషితం చేయొద్దు. పొడి చెత్త, తడి చెత్త రెంటినీ వేరు చేస్తే ఎంతో ఉపయోగపడతాయి. గుర్రపు డెక్క నుంచి కూడా బ్యాగులు, ఎరువులు తయారు చేసే పరిస్థితికి వచ్చాం. బ్యాగులు కూడా తయారుచేస్తున్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం నిషేధం కార్యక్రమంపై ప్రజల్లో మరింత చైతన్యం కలిగించేందుకు ముందుకొచ్చిన వారిని మనస్పూర్తిగా అభినందిస్తున్నాను. ప్లాస్టిక్ పెను భూతం. ప్రకృతిని నాశనం చేస్తోంది. ప్లాస్టిక్ తినడంతో శ్వాసకోశ వ్యాధులు, క్యాన్సర్లు వస్తున్నాయి. ఒకప్పుడు పంజాబ్ రాష్ట్రం దేశానికి అన్నం పెట్టింది. కానీ వారు పండించే పంటకు రసాయన ఎరువులు కొట్టడంతో అవి తింటున్న ప్రజలు క్యాన్సర్ బారిన పడుతున్నారు. నేడు ప్రతి రోజూ పంజాబ్ నుంచి ఢిల్లీకి క్యాన్సర్ రోగులతో ఒక ట్రైన్ వస్తోందంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. మా అత్తగారు క్యాన్సర్ తో చనిపోయారు. ఆవిడ పేరుతో బసవ తారకం క్యాన్సర్ ఆస్పత్రిని నెలకొల్పి వైద్య సేవలు అందిస్తున్నాము. క్యాన్సర్ నివారణపై ప్రభుత్వానికి సలహాలు ఇచ్చేందుకు ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణుడు నోరి దత్తాత్రేయుణ్ణి సలహాదారుగా నియమించాం ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

Author

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button