
గుంటూరు:డిసెంబరు 21 :-న్యాయ వ్యవస్థకు జిల్లా న్యాయ వ్యవస్థే మూలస్తంభమని సుప్రీమ్ కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా పేర్కొన్నారు. గుంటూరులోని రాష్ట్ర జ్యుడిషియల్ అకాడమీలో నిర్వహించిన “రాజ్యాంగ దృక్కోణం – జిల్లా న్యాయ వ్యవస్థ పాత్ర” అనే జాతీయ స్థాయి సెమినార్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై కీలక ఉపన్యాసం చేశారు.

ప్రపంచంలోనే భారత న్యాయ వ్యవస్థ అతి పెద్దదిగా ఉందని, అనేక దేశాల రాజ్యాంగాల కంటే ఉత్తమ విలువలు భారత రాజ్యాంగంలో ఉన్నాయని ఆయన తెలిపారు. న్యాయ వ్యవస్థలో ప్రతి అంశం రాజ్యాంగ సూత్రాలకు అనుగుణంగా ఉండాలన్నారు. క్లిష్ట పరిస్థితుల్లోనూ న్యాయమూర్తులు ప్రశాంతత, స్థైర్యం, ఓర్పుతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని సూచించారు.

సామాన్య ప్రజలకు న్యాయం చేరువ కావడంలో జిల్లా న్యాయ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుందని, కోర్టులో జరిగే విచారణ ప్రజలకు అర్థమయ్యేలా ఉండాలన్నారు. అప్పుడు మాత్రమే న్యాయ వ్యవస్థపై విశ్వాసం పెరుగుతుందని పేర్కొన్నారు. తీర్పులు ఇవ్వడమే కాకుండా, తీర్పులో నిబద్ధత, న్యాయమూర్తి ప్రవర్తన కూడా అత్యంత ముఖ్యమని అన్నారు.GUNTUR
సాంకేతిక పరిజ్ఞానం ఎంత అభివృద్ధి చెందినా న్యాయం మానవతా దృక్కోణంతోనే సాగాలని స్పష్టం చేశారు. ల్యాండ్‌మార్క్ తీర్పులకే కాకుండా, రోజువారీ కేసులను నిష్పక్షపాతంగా పరిష్కరించడమే నిజమైన న్యాయ సేవ అని చెప్పారు. రాజ్యాంగ విలువలు కాపాడటం ప్రతి న్యాయమూర్తి బాధ్యతగా పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, జ్యుడిషియల్ అకాడమీ పాట్రన్ ఆఫ్ చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ మాట్లాడుతూ, జిల్లా న్యాయ వ్యవస్థ న్యాయ వ్యవస్థలో అత్యంత కీలకమైనదన్నారు. జీవించే హక్కు అంటే కేవలం జీవించడమే కాకుండా, గౌరవప్రదమైన జీవితం గడపడం అని తెలిపారు. రాజ్యాంగాన్ని సమర్థంగా పరిరక్షించడమే దానికి ఇచ్చే నిజమైన గౌరవమని అన్నారు.

హైకోర్టు న్యాయమూర్తి, జ్యుడిషియల్ అకాడమీ బోర్డు ఆఫ్ గవర్నర్స్ అధ్యక్షులు జస్టిస్ రవినాథ్ తిల్హారి మాట్లాడుతూ, రాజ్యాంగం ఇచ్చిన పౌర హక్కులను జిల్లా న్యాయ వ్యవస్థ పటిష్టంగా రక్షించాల్సిన బాధ్యత ఉందన్నారు. మహిళలు, చిన్నారులకు సంబంధించిన కేసులను సున్నితంగా, సరైన విధానంతో పరిష్కరించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, జ్యుడిషియల్ అకాడమీ డైరెక్టర్ చింతలపూడి పురుషోత్తం కుమార్, జిల్లా ప్రధాన న్యాయమూర్తులు, రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న న్యాయ అధికారులు పాల్గొన్నారు.







