
హైదరాబాద్: నవంబర్ 9:-ఎప్పుడూ ఆరోగ్యం, వివిధ జబ్బులపై అవగాహన పరుగులకు వేదికగా నిలిచే నెక్లెస్ రోడ్‌లో ఈసారి సామాజిక రుగ్మతలపై ప్రత్యేకంగా అవగాహన రన్ జరిగింది. బెట్టింగ్, లోన్ యాప్‌లు, మొబైల్ వ్యసనం, జంక్ ఫుడ్ నిర్మూలనకై స్లేట్ ది స్కూల్ ఆధ్వర్యంలో “స్లేట్ స్మార్ట్ స్టార్ట్ 5కె ఎగైనెస్ట్ 5 పిట్ఫాల్స్ – వన్ మిషన్” అనే థీమ్‌తో ఈ కార్యక్రమం నిర్వహించారు.

స్కూల్ డైరెక్టర్ అమర్నాథ్ వాసిరెడ్డి తో కలిసి సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి జెండా ఊపి రన్‌ను ప్రారంభించారు. జలవిహార్ నుంచి పీపుల్స్ ప్లాజా వరకు సాగిన ఈ రన్‌లో పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఆధునిక సమాజంలో ముఖ్యంగా యువత ఆరోగ్యం, స్థిరత్వం, భవిష్యత్తును దెబ్బతీసే విధ్వంసక శక్తుల బారిన పడుతోందని డీసీపీ శిల్పవల్లి ఆందోళన వ్యక్తం చేశారు. నేటి తరుణంలో తల్లిదండ్రులు, విద్యార్థులు, సమాజం మొత్తం ఐదు ప్రధాన సమస్యలైన — జూదం, లోన్ యాప్స్, జంక్ ఫుడ్, మొబైల్ వ్యసనం, రొట్ లెర్నింగ్ — నుంచి బయటపడాలన్నదే ఈ రన్ ముఖ్య ఉద్దేశమని ఆమె తెలిపారు.






