పర్చూరు, సెప్టెంబర్ 20: పర్చూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం జరిగిన స్వర్ణాంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో పర్చూరు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ బి. వినోద్ కుమార్, ఆర్డీవో తదితర అధికారులు పాల్గొనగా, విద్యార్థులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు గారు, జిల్లా కలెక్టర్ గారు కలిసి కళాశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు.
పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని వారు పిలుపునిచ్చారు. అనంతరం జూనియర్ కళాశాల నుండి బొమ్మల సెంటర్ వరకు పర్యావరణ సెన్సిటైజేషన్ ర్యాలీ నిర్వహించబడింది. ర్యాలీలో విద్యార్థులు నినాదాలతో చుట్టూ ఉన్న వారిని ఆకట్టుకున్నారు.
పట్టణంలో శుభ్రత, పారిశుధ్యం పెంపునకు ప్రభుత్వ అధికారులు, ప్రజలు, ప్రతినిధులు కలిసి పనిచేయాలని కలెక్టర్ వినోద్ కుమార్ గారు తెలిపారు.
తరువాత జిల్లా పరిషత్ పాఠశాలలో జరిగిన సమావేశంలో భాగంగా మళ్లీ మొక్కలు నాటుతూ, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు.