గుంటూరు, 29 ఆగష్టు 2025 :- జిల్లాలో మాదక ద్రవ్యాలకు బానిసైన వారికి సత్వరమే డీ ఎడిక్షన్ సెంటర్ల ద్వారా కౌన్సిలింగ్, చికిత్స అందించేలా జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు ఇతర ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పటిష్ట ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ తెలిపారు.
శుక్రవారం కలెక్టరేట్ లోని డీఆర్సీ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ, జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తో కలసి జిల్లా స్థాయి మాదకద్రవ్యాల సమన్వయ కమిటీ (ఎన్ – సీ ఓ ఆర్ డీ ) సమావేశం జిల్లా అధికారులతో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ మాట్లాడుతూ జిల్లాలో మాదక ద్రవ్యాల వినియోగాన్ని పూర్తి స్థాయిలో అరికట్టేలా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రితో పాటు, జిల్లా జైలు లోను డీ ఎడిక్షన్ సెంటర్లు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. మాదక ద్రవ్యాల వినియోగం, రవాణా, అమ్మకాలపై సమాచారం ఉంటే అన్ని శాఖల అధికారులు పోలీస్ లకు సత్వరమే అందించాలన్నారు. విద్యా సంస్థల్లో మాదక ద్రవ్యాల వినియోగం వలన కలిగే దుష్పరిణామాలపై నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. మాదక ద్రవ్యాల వినియోగించకుండా హాస్టల్స్ లోను, విద్యాసంస్థల ప్రాంగణంలో పర్యవేక్షించాలన్నారు. మాదక ద్రవ్యాల వినియోగం పై సమాచారం ఉంటే వెంటనే సంబంధిత పరిధిలోని పోలీస్ లకు తెలియచేయటంతో పాటు విద్యార్దులపై చట్ట ప్రకారం నిర్లక్ష్యం లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. మాదక ద్రవ్యాలకు వినియోగానికి అవకాశం ఉన్న శివారు ప్రాంతాల్లో, శిధిలమైన భవనాలు వద్ద స్థానిక సంస్థలు విద్యుత్ దీపాలు ఏర్పాటుతో పాటు, నిరుపయోగమైన భవనాలను కూల్చివేయాలన్నారు. మాదక ద్రవ్యాల వినియోగం సమాచారం అందించటానికి ఏర్పాటు చేసిన 1972 టోల్ ఫ్రీ నెంబరు ప్రచార బోర్డులను విద్యా సంస్థల్లోను, ముఖ్య కూడళ్ళలోను, వలస కార్మికులు నివాస ప్రాంతాల్లోను, అన్ని ముఖ్య ప్రాంతాల్లోను ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకుపోలీస్ శాఖను సమన్వయం చేసుకుంటూ అన్ని శాఖల అధికారులు సమన్వయంతో బాద్యతగా విధులు నిర్వహించాలన్నారు.
జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో మాదక ద్రవ్యాల వలన కలిగే అనార్ధాలపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేలా వారధి, పల్లే నిద్ర, అపరేషన్ నషా ముక్త్ భారత్ అపరేషన్ సేఫ్ క్యాంపస్ ద్వారా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలో గత నెల రోజులుగా 8 ఎన్డీపీఎస్ కేసులు రిజిస్టర్ చేసి 53 మందిని అరెస్ట్ చేశామన్నారు. ఎన్డీపీఎస్ కేసుల్లోని ముద్ధాయిలకు ప్రత్యేకంగా రౌడిషీటర్లు తరహా పోలీస్ స్టేషన్లలో కౌన్సిలింగ్ నిర్వహించటం జరుగుతుందన్నారు. ఎక్సైజ్, పోలీస్ శాఖలు సమన్వయం చేసుకుంటూ మత్తు పదార్దల వినియోగం, అమ్మకాలు రిపీటెడ్ గా చేస్తున్నా వారిపై పీఐటీ ఎన్డీపీఎస్ యాక్ట్ క్రింద కేసులు నమోదుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. మాదక ద్రవ్యాలకు ఎక్కువుగా యువత ఆకర్షితులవుతున్నందున విద్యా సంస్థల్లోని ఈగల్ క్లబ్ ద్వారా పోలీస్ శాఖ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు. జిల్లాలోని అన్ని విద్యా సంస్థల్లో ఈగల్ క్లబ్ లు ఏర్పాటు చేశారని ప్రోఫెషనల్ విద్యా సంస్థల్లోను ఈగల్ క్లబ్ ల ఏర్పాటును వెంటనే పూర్తి చేయాలన్నారు. మాదక ద్రవ్యాల రవాణా పై రైల్వే, ఆర్టీసీ, రవాణా శాఖ అధికారులు నిరంతర పర్యవేక్షిస్తూ సమాచారం ఉంటే వెంటనే పోలీస్ శాఖకు తెలియచేయాలన్నారు.
సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎన్ ఎస్ కే ఖాజావలి, జిల్లా విభిన్నప్రతిభావంతుల శాఖ ఇన్చార్జి ఏడీ దుర్గాబాయి, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారిణి డా. విజయలక్ష్మీ, ఇంటర్మీడియట్ ఆర్ఐఓ సునీత, డీవీఈఓ(ఇంటర్మీడియట్) వెంకటేశ్వరరెడ్డి, ఐసీడీఎస్ పీడీ ప్రసునా, అసిస్టెంట్ డైరక్టర్ డ్రగ్ ఇన్స్పెక్టర్ డి లక్ష్మణ్, జిజీహెచ్ నార్కోటిక్ కౌన్సిలింగ్ సెంటరు అసోసియేట్ ప్రోఫెసర్ డా. కిరణ్, జిల్లా సాంఘీక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరక్టర్ చెన్నయ్య, డీఆర్డీఏ పీడీ టీ వీ విజయలక్ష్మీ, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి పి.మురళి, మెప్మా పీడీ వి విజయలక్ష్మీ, నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్లు వెంకట కష్ణయ్య, ఎన్టీసీపీ సైకలాజిస్ట్ పి నాగజ్యోతి, శ్రీనివాసులు ఈగల్ సెల్ ఎస్ఐ సునీల్,విద్యా, వ్యవసాయ, ఎక్సైజ్, రవాణా, ఆర్టీసీ, రైల్వే శాఖల అధికారులు,యూనివర్సీటీలు, ఇంజనీరింగ్, మెడికల్ కళాశాల ప్రతినిధులు పాల్గొన్నారు.
2,277 2 minutes read