
ఏలూరు జిల్లా, నూజివీడు:-నూజివీడు సబ్ రిజిస్ట్రార్ చాకచక్యంగా వ్యవహరించడంతో భారీ మోసానికి పాల్పడిన నిందితులు పోలీసుల చేతికి చిక్కారు. దొంగ రిజిస్ట్రేషన్ పత్రాలతో లోన్ రద్దు చేయడానికి చేసిన ప్రయత్నాన్ని సబ్ రిజిస్ట్రార్ అడ్డుకున్నారు.
తాడేపల్లిగూడెం కు చెందిన అద్దేపల్లి వెంకటరత్నం శ్రీరామ్ ఫైనాన్స్‌లో కోటి రూపాయల రుణం తీసుకున్నాడు. అయితే ఆ రుణం పూర్తిగా చెల్లించకపోయినా, ఫైనాన్స్‌తో సంబంధం లేని మరో వ్యక్తి దొడ్డి నాగరాజుతో కలిసి లోన్ క్లియర్ అయినట్లు నకిలీ పత్రాలు తయారు చేసి నూజివీడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించేందుకు ప్రయత్నించారు.
కోటి రూపాయల లోన్ ఇంకా క్లియర్ కాకుండానే, క్లియర్ అయినట్లుగా చూపిస్తూ నకిలీ పత్రాలు, నకిలీ గుర్తింపు కార్డులు, స్టాంపులతో రిజిస్ట్రేషన్‌కు వచ్చారు. అయితే పత్రాల్లో అనుమానాస్పద అంశాలు గుర్తించిన సబ్ రిజిస్ట్రార్ యన్. ఫణి సీతా రామరాజు వెంటనే అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారు.ELURU JILLA VAARATHALU
సమాచారం అందుకున్న పోలీసులు కార్యాలయానికి చేరుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నకిలీ పత్రాలతో లోన్ రద్దు చేసేందుకు చేసిన ఈ ప్రయత్నంపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
సబ్ రిజిస్ట్రార్ చాకచక్యంతో భారీ ఆర్థిక మోసం తప్పిందని అధికారులు పేర్కొన్నారు.










