
బాపట్ల: 20-11-25:- కర్లపాలెం మండలానికి చెందిన నల్లమోతువారిపాలెం ప్రాదేశిక నియోజకవర్గ ఎంపీటీసీ సభ్యుడు తాండ్ర సాంబశివరావు, కొత్త నందాయపాలెం సర్పంచ్ ఆట్ల వెంకటేశ్వరమ్మ తరపున గ్రామ సీనియర్ టీడీపీ నాయకుడు ఆట్ల అయ్యప్ప రెడ్డితో కలిసి బాపట్ల శాసన సభ్యులు వేగేశన నరేంద్ర వర్మ రాజును వారి కార్యాలయంలో కలిశారు.కొత్త నందాయపాలెం, నల్లమోతువారిపాలెం గ్రామాల అభివృద్ధి కోసం కర్లపాలెం మండల పరిషత్ ఆమోదించిన నిధుల విడుదలపై చర్చించిన ఈ ప్రతినిధి బృందానికి, సంబంధిత పనులు వేగవంతం చేసి నిధుల విడుదలకు తక్షణ చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే వేగేశన హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఎంపీటీసీ తాండ్ర మాట్లాడుతూ, “మా ప్రాదేశిక నియోజకవర్గ అభివృద్ధి పనులకు ముందుకొచ్చి నిధుల మంజూరుకు అంగీకరించిన ఎమ్మెల్యే గారికి గ్రామ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం” అన్నారు.గ్రామాల మౌలిక వసతుల మెరుగుదలకు ఈ నిధులు దోహదపడతాయని స్థానిక నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు.







