
గుంటూరు:29-10-25:-జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా వ్యవసాయ అధికారులను ఉద్దేశించి నానో యూరియాపై రైతులకు అవగాహన కల్పించాలంటూ సూచించారు. బుధవారం తుఫాను అనంతర పరిస్థితులను పరిశీలించేందుకు ప్రత్తిపాడు, పెదనందిపాడు, కాకుమాను మండలాల్లో పర్యటించిన కలెక్టర్, కాకుమానులోని ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం కార్యాలయాన్ని సందర్శించారు.

అక్కడ యూరియా నిల్వలు, నానో యూరియా వినియోగంపై సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ అయితా నాగేశ్వరరావు ఎరువులు, నానో యూరియా లక్షణాలు, ప్రయోజనాలపై వివరణ ఇచ్చారు. దీనిపై జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, నానో యూరియాను ఇప్పటికే ఉపయోగిస్తున్న రైతుల అనుభవాలను ఇతర రైతులతో పంచుకోవాలని సూచించారు. తద్వారా రైతులు దానిని విశ్వసించి వినియోగించేందుకు ముందుకు వస్తారని అన్నారు. రైతుల్లో నానో యూరియాపై నమ్మకం పెంపొందించేందుకు పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన ఆదేశించారు.

కొల్లిమర్లవాగు లాకులు పరిశీలన
తరువాత కలెక్టర్ కాకుమాను మండలంలోని కొల్లిమర్ల గ్రామం వద్ద కొల్లిమర్లవాగు లాకులను ప్రత్యక్షంగా పరిశీలించారు. వాగులో పూడికలు ఎక్కువగా ఉండటంతో ప్రవాహానికి ఆటంకం ఏర్పడుతున్నట్లు స్థానిక రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. పాత బ్రిడ్జి వద్ద నీటి ప్రవాహం సక్రమంగా లేకపోవడంతో, కొత్త బ్రిడ్జి నిర్మాణం అవసరమని రైతులు సూచించారు. వాగు ఆధునీకరణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు.ఈ పరిశీలన కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాసరావు, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ అయితా నాగేశ్వరరావు, జలవనరుల శాఖ పర్యవేక్షక ఇంజనీర్ వెంకట రత్నం తదితర అధికారులు పాల్గొన్నారు.







