
అమరావతి: నవంబర్ 28:-రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ నెల ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీకి భారీగా నిధులను విడుదల చేసింది. మొత్తం 63,25,999 మంది లబ్ధిదారులకు రూ. 2,738.71 కోట్లు విడుదల చేశామని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు.ఈ నెలలో కొత్తగా 8,190 పెన్షన్లు మంజూరు చేయబడినట్లు వెల్లడించారు. వాటి కోసం అదనంగా రూ. 3.28 కోట్లు కేటాయించినట్లు మంత్రి తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు పెన్షన్ పంపిణీగా ప్రభుత్వం రూ. 21,280 కోట్లు విడుదల చేసినట్లు వివరించారు.
డిసెంబర్ 1న ఎలూరు జిల్లాలోని ఉంగుటూరు మండలం గోపాలాపురం గ్రామ సచివాలయ పరిధిలో జరిగే సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారని మంత్రి తెలిపారు.గ్రామ–వార్డు సచివాలయ సిబ్బంది పింఛనుదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పెన్షన్లు అందజేయడం రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తున్న ప్రత్యేక సేవ అని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు.







