పల్నాడు, ఆగస్టు 2: ఓటర్ల ప్రత్యేక సంక్షిప్త సవరణ – 2026 ప్రక్రియలో భాగంగా, పల్నాడు జిల్లాలో పోలింగ్ స్టేషన్ల ఏర్పాట్లను సమీక్షించే ఉద్దేశ్యంతో జిల్లా కలెక్టర్ పీ. అరుణ్ బాబు ఆధ్వర్యంలో కీలక సమీక్షా సమావేశం నిర్వహించబడింది.
ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఏకా మురళి, జిల్లాకు చెందిన ఆర్డీవోలు, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఎలక్ట్రోల్ రిజిస్ట్రేషన్ అధికారులు, మున్సిపల్ అధికారులు, తహశీల్దార్లు, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
జిల్లాలో గతంలో 1932 పోలింగ్ కేంద్రాలు ఉండగా, ఈసారి ECI మార్గదర్శకాల ప్రకారం, ఒక్కో కేంద్రానికి గరిష్టంగా 1200 ఓటర్లు మాత్రమే ఉండేలా మార్పులు చేర్పులు చేపట్టారు. అందువల్ల కొత్తగా 184 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయబడి, మొత్తం పోలింగ్ కేంద్రాల సంఖ్య 2115కి చేరింది.
ఈ ప్రక్రియలో ప్రతి నియోజకవర్గంలో ఎలక్ట్రోల్ రిజిస్ట్రేషన్ అధికారులు, సహాయక అధికారులు, మున్సిపల్ అధికారులు రాజకీయ పార్టీల ప్రతినిధులతో చర్చించి అభిప్రాయాలను సేకరించారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ ఎన్నికల నిర్వహణ పారదర్శకంగా, సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు పక్కాగా చేస్తామన్నారు. ప్రజలంతా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఆధునిక వసతులతో కూడిన పోలింగ్ కేంద్రాల ఏర్పాటు కలిగించాలని ఆయన స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో ఆర్డీవోలు మధులత, రమాకాంత్ రెడ్డి, మురళీకృష్ణ, ఇతర అధికారులు కూడా పాల్గొన్నారు.