ఆంధ్రప్రదేశ్గుంటూరు

GUNTUR NEWS: ఎమ్మెల్సీ ఎన్నికలలో జరిగిన అక్రమాలపై చర్యలు తీసుకోవాలి – CPM

CPM LEADERS PRESS MEET

ఫిబ్రవరి 27న జరిగిన కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో అధికార పార్టీ తీవ్రమైన అక్రమాలకు పాల్పడిందని వీటిపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని సిపిఎం గుంటూరు జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. బ్రాడీపేట సిపిఎం కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వై. నేతాజీ, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాశం రామారావు, ఈమని అప్పారావు, కే.నళినీకాంత్ లు పాల్గొన్నారు.‌ అధికార పార్టీ వారు ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముందు రోజే ప్రజా సంఘాల కార్యకర్తలను బెదిరించారు. కొన్నిచోట్ల పిడిఎఫ్ తరఫున పోలింగ్ ఏజెంట్లుగా కూర్చోవద్దని హెచ్చరించారు. ప్రచారం సమయం ముగిసిన అనంతరం ఎన్నారై కాలేజీ, కిట్స్ కాలేజీ విద్యార్థులతో గుంటూరులో హెల్ప్ డెస్క్ పేరుతో శిబిరాలు ఏర్పాటు చేసి అధికార పార్టీ అభ్యర్థికి అనుకూలంగా ప్రచారం నిర్వహించారు. పోలింగ్ సందర్భంగా చేసిన అక్రమాలకు అంతులేదు. పోలింగ్ కేంద్రంలోనే ప్రత్యర్థి తరఫున ఏజెంట్లుగా ఉన్న వారికి డబ్బులు ఎరవేసి లొంగదీసుకునే ప్రయత్నం జరిగింది. వినని వారిని బెదిరించారు. గట్టిగా నిలబడిన వారిపై తప్పుడు కేసులు పెట్టి పోలీసులు చేత బయటికి లాగించారు. ఎమ్మెల్యేలు పోలింగ్ బూతులలోకి అక్రమంగా వెళ్లారు. ప్రశ్నించిన పోలింగ్ ఏజెంట్లకు అంతు చూస్తామని బెదిరించారు. పోలింగ్ అధికారుల సమక్షంలోనే ఇలాంటి బెదిరింపులు జరిగాయి. గుంటూరులో అధికార పార్టీ కార్పొరేటర్లు, తెనాలిలో కౌన్సిలర్లు పోలింగ్ బూతులలోకి ఇస్టానుసారం జొరబడ్డారు. గుంటూరు, మంగళగిరిలలో పిడిఎఫ్ మద్దతుదారులపై దాడులు చేశారు. గుంటూరులో ఒక బూతులో ఒక్కొక్కరికి ఒకటి కంటే ఎక్కువ బ్యాలెట్ పేపర్లు అధికారులు ఇచ్చారు. పోలింగ్ ఏజెంట్లు అభ్యంతర పెట్టినా ఖాతరు చేయలేదు. తెనాలిలో పోలింగ్ కేంద్రం ఆవరణలోనే ముఠాలు ఉండి ఉదయం నుండి సాయంత్రం వరకు ఓట్లు వేసి వచ్చిన వారి వేలిపై ఉన్న ఇంకును అక్కడికక్కడే ఏరేజ్ చేసి మళ్లీ ఓట్లకు పంపారు. ఇలా భారీ ఎత్తున దొంగ ఓట్లు పోలింగ్కు పాల్పడ్డారు. పోలింగ్ అధికారులుగా ఉన్నవారు ఓటర్ల గుర్తింపు కార్డులను అడగకుండా దొంగ ఓట్ల పోలింగ్ కు సహకరించారు. సీసీ కెమెరాల పుటేజీలు పరిశీలన చేస్తే ఎవరెవరు ఎన్నిసార్లు ఓటింగ్కు వచ్చారో సులభంగా గ్రహించవచ్చు. జిల్లాలోని అత్యధిక పోలింగ్ కేంద్రాల లోపల అధికార పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో గుంపులుగా పోగయి క్యాంపెయిన్ చేశారు. ఓటర్లను తరలించేందుకు వాహనాలు ఏర్పాటు చేశారు. రవాణా ఖర్చుల పేరుతో ఓటర్లకు డబ్బులు పంపిణీ చేశారని చెప్పారు. అక్రమాలన్నీ పోలీసులు మరియు పోలింగ్ సిబ్బంది సమక్షంలోనే జరుగుతున్నా వాటిపై చర్యలు తీసుకోమని పలుమార్లు ఫిర్యాదులు చేసినా వారు ఏ మాత్రం స్పందించలేదు. జిల్లా, రాష్ట్ర ఎన్నికల అధికారులకు ఫిర్యాదు అనంతరం వచ్చిన అదనపుపోలీసు సిబ్బంది కూడా ప్రేక్షక పాత్ర వహిస్తూ అధికార పార్టీ అనుయాయులు చేస్తున్న అక్రమాలకు సహకరించారు.
ఈ అక్రమాలన్నింటిపై విచారణ నిర్వహించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేసింది.

Author

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button