
Chirala:07-11-25:-చీరాల పట్టణంలో రూ.2 కోట్ల రూపాయల నిధులతో నిర్మించనున్న నూతన అగ్నిమాపక కేంద్ర భవన నిర్మాణానికి శుక్రవారం భూమి పూజ జరిగింది. ఈ కార్యక్రమంలో బాపట్ల జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి కొలుసు పార్థసారథి, చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య పాల్గొన్నారు. అనంతరం మంత్రి పార్థసారథి నూతన అగ్నిమాపక కేంద్ర శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఇటీవల మోంతా తుఫాన్ ప్రభావంతో బాపట్ల జిల్లాలో ఎటువంటి ప్రాణ నష్టం చోటు చేసుకోకుండా, సీఎం చంద్రబాబు నాయుడు పర్యవేక్షణలో జిల్లా యంత్రాంగం అద్భుతంగా పనిచేసిందని ఆయన పేర్కొన్నారు. తుఫాన్ ప్రభావాన్ని ఎదుర్కోవడంలో ఎన్‌డిఆర్‌ఎఫ్ సిబ్బంది, అగ్నిమాపక శాఖ అధికారులు చేసిన సేవలు విశేషమని, వరదల్లో చిక్కుకున్న ప్రజలను రక్షించడంలో వారి కృషి అభినందనీయమని అన్నారు.తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని, పంట నష్టాల అంచనాలు పూర్తయ్యాయని తెలిపారు. ప్రజల భద్రతకు ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని మంత్రి పార్థసారథి పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్, జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, చీరాల టీడీపీ అధికార ప్రతినిధి మద్దులూరి మహేంద్రనాథ్, ఆప్కో చైర్మన్ సజ్జ హేమలత, కూటమి నాయకులు, ఫైర్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.







