
Tirupathi:కె.వి.బి.పురం:నవంబర్ 7 : కె.వి.బి.పురం మండలం పాతపాలెం వద్ద గల ఓలూరు రాయల చెరువుకు గండి పడిన ఘటనపై జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ ప్రత్యక్షంగా పరిశీలించారు. చెరువు గండి పడిన కారణాలను ఆరా తీసి, బాధిత గ్రామాలను సందర్శించి పరిస్థితిని సమీక్షించారు.కలెక్టర్ వెంట ట్రైనింగ్ కలెక్టర్ సందీప్ రఘువాన్షి, కాళహస్తి ఆర్డీఓ భాను ప్రకాష్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ అధికారులు ఉన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ—“ఇది ఒక పెద్ద విపత్తు. ప్రతి బాధిత కుటుంబానికి విపత్తు నిర్వహణ నిధుల కింద తగిన పరిహారం అందించబడుతుంది. గ్రామాలు మళ్లీ సాధారణ స్థితికి చేరుకునేలా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నాయి” అని తెలిపారు.ఓలూరు గ్రామ పరిధిలో ఉన్న రాయల చెరువు కట్ట తెగిపోవడంతో పాతపాలెం, కలత్తూరు, ఎస్.ఎల్.పురం, హరిజనవాడ గ్రామాలకు నీరు చేరి భారీ నష్టం జరిగినట్లు కలెక్టర్ వివరించారు. ఈ చెరువు పుత్తూరు రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతం నుంచి నీరు అందుకునే క్యాచ్మెంట్ ఏరియా కలిగి ఉండి, దాదాపు 0.8 టీఎంసీ (80 ఎంసిఎఫ్‌టి) నీటి నిల్వ సామర్థ్యం కలిగి ఉందని చెప్పారు. చెరువు కింద సుమారు 1200 ఎకరాల ఆయకట్టు ఉండి, నాలుగు గ్రామాలకు సాగునీరు అందిస్తుందని తెలిపారు.

కట్ట కూలిపోవడానికి మట్టి బలహీనతే ప్రధాన కారణమని కలెక్టర్ తెలిపారు. “చెరువు బండ్ కింద ఉన్న మట్టి బలహీనంగా ఉండటంతో గ్రాడ్యువల్ సాయిల్ స్లిప్పేజ్ ఏర్పడి, నీరు బండ్‌పైకి చేరింది. ఉదయం 5 గంటల సమయంలో చేపలు పడుతున్న గ్రామస్థులు నీటిలో బురద గమనించి సర్పంచ్, ఉపసర్పంచ్‌లకు సమాచారం ఇచ్చారు. 6.30కు నీరు బండ్‌పైకి వచ్చేసరికి అధికారులు చేరుకున్నప్పటికీ నీటి ఫోర్స్‌ను అదుపు చేయడం సాధ్యం కాలేదు” అని వివరించారు.దీంతో మొత్తం చెరువు కట్ట తెగిపోవడంతో కింద ఉన్న గ్రామాలపై నీరు ఉప్పెనలా దూసుకెళ్లిందన్నారు. నాలుగు గ్రామాలు పూర్తిగా బురదతో నిండిపోయాయి, దేవుడి దయవల్ల ఎవరూ మృతి చెందలేదని చెప్పారు. అయితే పశువులు, గొర్రెలు, గేదెలు కొట్టుకుపోయాయని, కలత్తూరులో నీరు 7 అడుగుల ఎత్తు వరకు చేరిందని తెలిపారు.ఇళ్లలో ఫర్నిచర్, ఎలక్ట్రానిక్ పరికరాలు, దుస్తులు తడవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రబీ సీజన్‌లో వేసిన వేరుశనగ పంట పూర్తిగా నాశనం అయ్యిందని కలెక్టర్ వెల్లడించారు. బైకులు, ట్రాక్టర్లు కూడా నీటిలో కొట్టుకుపోయినట్లు చెప్పారు.

ప్రమాదం జరిగిన వెంటనే పోలీస్, ఇరిగేషన్, స్థానిక నాయకులు ప్రజలను అప్రమత్తం చేసి సురక్షిత ప్రదేశాలకు తరలించారు. శానిటేషన్ పనులు, రోడ్డు మరమ్మత్తులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టినట్లు తెలిపారు.ప్రభావిత గ్రామాల్లో రిలీఫ్ సెంటర్లు ఏర్పాటు చేసి ప్రజలకు తాగునీరు, ఆహారం, అవసరమైన వస్తువులు అందించారని కలెక్టర్ తెలిపారు. “ప్రభుత్వం ఈ ఘటనను విపత్తుగా పరిగణించి, నష్టాల అంచనా పనులు ఇంటింటికీ జరుగుతున్నాయి. పశువుల నష్టం, పంట నష్టం, గృహ సామగ్రి నష్టం వంటి వివరాలు సేకరిస్తున్నాం” అని చెప్పారు.










