ELURU NEWS:నేటి యువత వ్యవసాయం, పశుపోషణపై ఆసక్తి చూపడం శుభపరిణామం..
నేటి యువత వ్యవసాయం, పశుపోషణపై ఆసక్తి చూపడం శుభపరిణామం
రాష్ట్ర రైతాంగానికి అదనపు ఆదాయం అందించాలన్న సదుద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం మేలుజాతి లేగ దూడల పోషణ దిశగా అన్నదాతల్ని ప్రోత్సహిస్తోందని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. యడ్లపాడు మండల కేంద్రంలో ఏపీ పశుగణాభివృద్ధి సంస్థ, పశుసంవర్థకశాఖ సంయుక్తంగా నిర్వహించిన మేలుజాతి లేగ దూడల ప్రదర్శన కార్యక్రమానికి మాజీ మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో తొలుత లేగదూడలు..గొర్రెలు.. మేకల్ని పరిశీలించిన మాజీమంత్రి, కొన్నింటికి స్వయంగా టీకాలు వేసి, వాటి ఆరోగ్యంపై అధికారుల్ని ఆరాతీశారు. ఎక్కువ పాలదిగుబడి సాధిస్తున్న రైతులను పేరుపేరునా ప్రశంసించి వారికి బహుమతులు అందచేశారు. అనంతరం గ్రామస్తుల్ని, రైతుల్ని ఉద్దేశించి మాట్లాడారు. రైతులు వ్యవసాయాన్ని ఎంత శ్రద్ధగా, పట్టుదలతో చేస్తున్నారో, అదేవిధంగా పశుపోషణ చేపట్టాలని ప్రత్తిపాటి సూచించారు. వ్యవసాయంలో ఉండే ప్రశాంతత, సంతృప్తి మరే పనిలోనూ ఉండదని ఆయన చెప్పారు. నేటి యువత వ్యవసాయం, పశువుల పెంపకంపై ఆసక్తి చూపడం శుభపరిణామమని పుల్లారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు ఉపసంచలకులు పి. రామారావు, సహాయ సంచాలకులు టీ.శ్రీనివాసరావు, జి.రామ్మోహన్ రావు, డాక్టర్ రాధాకృష్ణ, జనసేన ఇంచార్జి తోట రాజా రమేష్, టీడీపీ నాయకులు కామినేని సాయి బాబు, కుర్రా రత్తయ్య, పోపూరి రాఘవరావు, పొపురి రామారావు, వెంకట రతయ్య, అధికారులు డాక్టర్ లు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.