తక్కువ కేలరీల షేక్స్ నుంచి బరువు తగ్గించే ఇంజెక్షన్ల వరకు బరువు తగ్గడానికి అనేక రకాల పరిష్కారమార్గాలు అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో బరువు తగ్గించే పోకడలకు కేంద్రంగా మారింది సోషల్ మీడియా. “ఓట్జెంపిక్” డ్రింక్ అత్యంత వేగంగా వైరల్ అవ్వడంతో సోషల్ మీడియాలో దీని పట్ల క్రేజ్ పెరుగుతోంది.
సోషల్ మీడియాలో అత్యంతగా ట్రెండింగ్ లో ఉన్నపదం ఓట్‌జెంపిక్.. బరువు తగ్గించడంలో వేగంగా పనితీరు కనబరుస్తున్న పానీయం ఇది. ఈ పానీయం తీసుకోవడం వల్ల కేవలం రెండు నెలల్లో దాదాపు 20కిలోల బరువు తగ్గినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ పానీయం వల్ల ఎంతవరకు ఆరోగ్యంగా ఉండొచ్చనే దానిపై డైటీషియన్లు పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
ఓట్జెంపిక్ పై టిక్‌టాక్‌లో బరువు తగ్గించే పానీయంగా కొందరు ప్రచారం చేస్తున్నారు. అరకప్పు ఓట్స్, ఒక కప్పు నీరు, సగం నిమ్మరసంతో కూడిన ఇంట్లో తయారుచేసిన పానీయం. దీనినే “ఓట్జెంపిక్” అని అంటున్నారు. ఐతే ఇది సంపూర్ణ ఆరోగ్యవంతమైన పానీయం కాదని కొంతమంది పోషకాహార నిపుణులు వెల్లడిస్తున్నారు. మనిషికి కావాల్సిన పోషకాలు ఈ డ్రింక్ లో లభించవని, కేవలం ఫైబర్ తోపాటు, కార్బొహైడ్రేట్స్ మాత్రమే ఉంటాయని అందుకే దీనిని ఆమోదించలేమని వారు చెబుతున్నారు.
అయితే, ఓట్స్ లో ఉండే ఫైబర్ శరీరానికి ఉపయోగకరమని, కొంతమంది డైటీషియన్లు సూచిస్తున్నారు. కానీ, ఈ పానీయం సంపూర్ణ ఆహారం కాకపోవడం, ఇతర పోషకాలు లేకపోవడం వంటి కారణాల వల్ల దీన్ని మాత్రమే ఆధారంగా తీసుకోవడం సురక్షితమేమీ కాదు.
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.