
బాపట్ల:09-12-2025:-జిల్లా పంచాయతీల్లో ఆదాయ వనరులను పెంచుకోవాలని అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లో సంబంధిత శాఖల అధికారులతో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, పంచాయతీ పురోగతి అంశాలపై ఆయన వీక్షణ సమావేశం నిర్వహించారు.కలెక్టర్ మాట్లాడుతూ పంచాయతీల అభివృద్ధి కోసం స్వంత ఆదాయాన్ని పెంపొందించే ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ఇంటి పన్నులు, నీటి పన్నులు బకాయిలు లేకుండా వసూలు చేయాలని, పంచాయతీలకు చెందిన వాణిజ్య భవనాలు, ఇతర అద్దె భవనాల అద్దెలను సమగ్రంగా వసూలు చేయాలని ఆదేశించారు. మార్కెట్ డిమాండ్‌ను బట్టి దుకాణాల అద్దెలను సవరించాలని, పంచాయతీ భవనాలు, అద్దెల వివరాలతో కూడిన సమగ్ర నివేదికను పంపించాలని పేర్కొన్నారు. వచ్చే ఆదాయంతో గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరాన్ని ఆయన వివరించారు.
ఆదర్శ గ్రామ యోజనను కచ్చితంగా అమలు చేయాలని, ఈ పథకంలో ప్రతి గ్రామానికి మంజూరైన రూ.80 లక్షల నిధులను జాగ్రత్తగా వినియోగించి అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని సూచించారు.గ్రామాల్లో సరఫరా చేసే నీటి ట్యాంకులపై తప్పనిసరిగా క్లోరినేషన్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. నీటి కాలుష్యం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచిస్తూ, కొల్లూరు గ్రామంలో నిర్లక్ష్యం ఎందుకు జరిగిందని అక్కడి అధికారులను ప్రశ్నించారు. గ్రామాల పారిశుద్ధ్యంపై డిప్యూటీ ఎంపీడీవోలు పూర్తి బాధ్యత వహించాలని సూచించారు.స్వామిత్వ సర్వేను సమర్థంగా నిర్వహించాలని కలెక్టర్ చెప్పారు. చిన్నగంజాం మండలంలో సర్వే సక్రమంగా జరగకపోవడంపై ఆరా తీసి, లోపాలను వెంటనే సవరించాలని ఆదేశించారు.జిల్లాలో లక్ష్యంగా పెట్టుకున్న 406 సామాజిక మరుగుదొడ్లలో ఇప్పటివరకు కేవలం 97 మాత్రమే నిర్మించడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన కలెక్టర్, జాప్యాన్ని తక్షణమే తొలగించి మిగిలిన నిర్మాణాలను వేగవంతం చేయాలని ఆదేశించారు. అదనంగా మంజూరైన 341 సామాజిక మరుగుదొడ్లను కూడా త్వరితగతిన నిర్మించాలని సూచించారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాన్ని వేగం గా పూర్తి చేయాలని, ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సముచిత మరుగుదొడ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులు కు స్పష్టమైన సూచనలు జారీ చేశారు.ఈ సమావేశంలో డిపిఓ ప్రభాకర్ రావు, సర్వే ల్యాండ్స్ రికార్డ్స్ ఏడి అల్తాఫ్, డ్వామా పీడీ విజయలక్ష్మి, వివిధ మండలాల ఎంపీడీవోలు, డిప్యూటీ ఎంపీడీవోలు తదితర అధికారులు పాల్గొన్నారు.







