
- ఫోన్లకు దూరంగా ఉండి పరీక్షలకు సన్నద్ధం కావాలని సూచన
- చీరాల ఏపీ మోడల్ స్కూల్లో పోలీసుల అవగాహన కార్యక్రమం
చీరాల: త్వరలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాయబోతున్న విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా, ప్రశాంతంగా పరీక్షలు రాసేలా పోలీసు శాఖకు చెందిన ‘శక్తి బృందం’ దిశానిర్దేశం చేసింది. బాపట్ల జిల్లా ఎస్పీ (ఐపీఎస్) బి. ఉమామహేశ్వర్ ఆదేశాలు, చీరాల సబ్ డివిజన్ డీఎస్పీ మోయిన్ పర్యవేక్షణలో మంగళవారం చీరాలలోని ఏపీ మోడల్ స్కూల్లో విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
సమయాన్ని సద్వినియోగం చేసుకోండి.. ఈ సందర్భంగా శక్తి బృందం మహిళా కానిస్టేబుళ్లు సీహెచ్. సునీత, బి. ధనలక్ష్మి విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడి పలు కీలక సూచనలు చేశారు. పరీక్షల సమయంలో మొబైల్ ఫోన్లకు పూర్తిగా దూరంగా ఉండాలని వారు స్పష్టం చేశారు. ఒక్కో పరీక్షకు మధ్య 4 నుంచి 5 రోజుల సమయం ఉన్నందున, ఆ కాలాన్ని వృథా చేయకుండా సద్వినియోగం చేసుకుని ప్రణాళికాబద్ధంగా చదువుకోవాలని సూచించారు. పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి తల్లిదండ్రులకు, చదువుకున్న పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి.. పరీక్షా కేంద్రాలకు వెళ్లేటప్పుడు, వచ్చేటప్పుడు విద్యార్థులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పరీక్షల సమయంలో సమయానికి తప్పనిసరిగా నీళ్లు తాగాలని, ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని చెప్పారు. పరీక్షా కేంద్రంలో ఏవైనా అనారోగ్య సమస్యలు తలెత్తితే వెంటనే భయపడకుండా అక్కడి ఉపాధ్యాయ సిబ్బందికి తెలియజేయాలన్నారు. అలాగే, విద్యార్థినులు, మహిళలు ఏవైనా ఆపద లేదా అత్యవసర పరిస్థితులు ఎదురైతే తక్షణమే ‘శక్తి’ హెల్ప్‌లైన్ నంబర్లను వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.bapatla news







