
గుంటూరు: డిసెంబర్ 30:-పదవ తరగతి పరీక్షల్లో సాధించే మార్కులే విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయిస్తాయని జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా అన్నారు. ఉన్నత చదువులు, ఉపాధి అవకాశాలకు పదవ తరగతి కీలకమని విద్యార్థులకు సూచించారు.
మంగళవారం గుంటూరు నగరంలోని ఏ.టి. అగ్రహారంలో ఉన్న ఎస్.కే.బి.ఎం మున్సిపల్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా పదవ తరగతి విద్యార్థులతో ప్రత్యక్షంగా మాట్లాడి, బోధన విధానం, పరీక్షల సన్నద్ధతపై ఆరా తీశారు. తరగతి గదులు పరిశీలించి విద్యార్థుల అవగాహన స్థాయిని తెలుసుకున్నారు.

డాక్టర్లు, ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు, ఉపాధ్యాయులు, సీఏలు, ఆర్మీ అధికారులుగా ఎంత మంది అవ్వాలనుకుంటున్నారని ప్రశ్నించి విద్యార్థుల అభిరుచులను కలెక్టర్ తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధిస్తే భవిష్యత్తు బలంగా ఉంటుందని తెలిపారు. రానున్న పదవ తరగతి పరీక్షల్లో రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఉత్తమ మార్కులు సాధించి, నూరు శాతం ఉత్తీర్ణత సాధించాలని విద్యార్థులను ప్రోత్సహించారు.
ప్రభుత్వం రూపొందించిన ప్రణాళిక ప్రకారం విద్యార్థులు చదువుకోవాలని సూచించిన కలెక్టర్, వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రతి పాఠశాలకు ప్రత్యేక అధికారిని నియమించామని, సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరిస్తామని చెప్పారు.

విద్యార్థులు మాక్ టెస్ట్ పరీక్షలు ప్రత్యేకంగా నిర్వహించాలని, గణితం, బయాలజీ, హిందీ సబ్జెక్టులకు అదనపు తరగతులు కావాలని, సాయంత్రం స్టడీ అవర్స్‌లో అల్పాహారం అందించాలని కోరారు. guntur 3దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ మాక్ టెస్ట్ పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని, అవసరమైన సబ్జెక్టులకు అదనపు తరగతులు నిర్వహించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. సాయంత్రం స్టడీ అవర్స్‌లో అల్పాహారం అందిస్తామని స్పష్టం చేశారు.

జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో పదవ తరగతి విద్యార్థులతో ప్రధానోపాధ్యాయులు ప్రత్యేకంగా మాట్లాడి, అవసరమైన సబ్జెక్టుల్లో అదనపు తరగతులు నిర్వహించాలని జిల్లా విద్యాశాఖ అధికారిని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి డా. సలీం భాష, ఎంఈఓ ఖుద్దూస్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఖాజావలి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.







