
కృష్ణాజిల్లా :నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళికతో పదవ తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించడం సాధ్యమేనని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. ఆ దిశగా జిల్లా విద్యాశాఖ అధికారులు సమన్వయంతో కృషి చేయాలని ఆయన ఆదేశించారు.
జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక అధికారులు, మండల విద్యాధికారులు, ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు నిర్వహించిన మార్చి–2026 పదవ తరగతి విద్యార్థుల “వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక” కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి పరీక్షల్లో నూరు శాతం ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు.

ఈ లక్ష్య సాధన కోసం ప్రతి ప్రభుత్వ పాఠశాలకు ఒక జిల్లా అధికారిని ప్రత్యేక అధికారిగా నియమించినట్లు తెలిపారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేలా ఉపాధ్యాయులు నిరంతరం ప్రోత్సహించాలని అన్నారు. ముఖ్యంగా చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారి వివరాలతో జాబితా రూపొందించాలని, వారు ఏయే సబ్జెక్టుల్లో బలహీనంగా ఉన్నారో సంబంధిత ఉపాధ్యాయుల సహకారంతో గుర్తించి, వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించారు.Krishna gilla local news
విద్యార్థుల ప్రగతిని తరచూ సమీక్షిస్తూ, అవసరమైన చోట అదనపు శిక్షణ అందిస్తే ఆశించిన ఫలితాలు సాధ్యమవుతాయని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ స్పష్టం చేశారు.










