పల్నాడు జిల్లా, కారంపూడి:21 9 25 :-పల్నాడు జిల్లాలోని కారంపూడి మండలం నరమాలపాడు వద్ద ప్రధాన రహదారిపై ఇటీవల ఒక విచిత్రమైన, అలాగే ఆందోళనకరమైన పరిణామం చోటుచేసుకుంది. ప్రధాన రహదారిపై కొందరు మహిళలు పెద్ద పెద్ద తాళ్లను అడ్డంగా పెట్టి, వాహనాలను నిలిపివేస్తూ అక్రమంగా డబ్బులు వసూలు చేస్తుండటం స్థానికంగా తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.
తాజాగా జరిగిన ఘటనలో తాడును గమనించలేక ఇద్దరు ద్విచక్ర వాహనదారులు పడిపోయి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మరోవైపు, ఒక కారుకు హల్క్‌గా డ్యామేజ్ కూడా సంభవించింది. వాహనదారులు దీని గురించి గట్టిగా నిలదీయగా, అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న మహిళలు ఒకేసారి అతనిపై దాడికి దిగారు. ఇది స్థానిక ప్రజల్లో తీవ్ర ఆందోళనకు కారణమవుతోంది.
ఇలాంటి అక్రమ దందాలు కేవలం కారంపూడి ప్రాంతానికే పరిమితమయ్యేలా కనిపించట్లేదు. జిల్లాలోని పలు ప్రధాన రహదారుల్లో ఇలాంటి దాడులు జరుగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. మహిళలు తాళ్లతో రోడ్డును అడ్డగించి వాహనాలను నిలిపివేస్తూ, భక్తుల మీద రాళ్లతో దాడి చేస్తున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి.
ఇటీవల శ్రీ లక్ష్మీ అమ్మవారి దేవాలయానికి వెళ్లే భక్తులను కూడా ఇలాగే అడ్డగించి, భయభ్రాంతులకు గురిచేసిన ఘటనపై భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ప్రజల ప్రశ్న – పోలీసుల స్పందన ఎక్కడ?
ఇంత జరుగుతున్నా, స్థానిక పోలీసు వ్యవస్థ మాత్రం దీనిపై స్పందించకపోవడం గమనార్హం. ఈ ఘటనలపై ఇప్పటికీ ఎటువంటి కఠిన చర్యలు తీసుకోకపోవడాన్ని ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. “రోడ్డుపై ప్రయాణించే ప్రతి ఒక్కరిని రక్షించాల్సిన బాధ్యత పోలీసులది. అలాంటిది వారు నిశ్శబ్దంగా ఉండటం అర్థంకాని విషయం” అని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మూసివేయాల్సినదే ఈ అక్రమ దందా:
ఈ ఘటనలపై జిల్లా అధికారులు తక్షణమే స్పందించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, రహదారిపై వాహనదారుల భద్రతను నిర్ధారించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.