
పల్నాడు, అక్టోబర్ 18:-జిల్లాలో మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టడం, మహిళల భద్రతను కాపాడడం, రోడ్డు భద్రత నియమాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పల్నాడు జిల్లా పోలీసులు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు.జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు ఐపీఎస్ ఆదేశాల మేరకు నాదెండ్ల, బెల్లంకొండ, శావల్యపురం, నకిరేకల్లు పోలీస్ స్టేషన్ల పరిధిలోని పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలిసి పోలీసులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, యువతలో మాదకద్రవ్యాల వినియోగం ప్రమాదకరమని హెచ్చరించారు. 15 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు గల యువకులు ఎక్కువగా డ్రగ్స్ మత్తుకు అలవాటు పడుతున్నారని, తద్వారా నేరప్రవర్తన వైపు దారి మళ్లి తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని తెలిపారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లల ప్రవర్తనపై పర్యవేక్షణ వహించాలని సూచించారు.జిల్లా వ్యాప్తంగా 370 ఈగల్ క్లబ్‌లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మాదకద్రవ్యాల వినియోగం లేదా విక్రయంపై సమాచారం ఉంటే 1972 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా పోలీసులకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.
శక్తి యాప్ ప్రయోజనాలు:
మహిళల భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన శక్తి SOS యాప్ గురించి కూడా విద్యార్థులకు వివరించారు. బాల్యవివాహాలు, వరకట్న వేధింపులు, లైంగిక వేధింపులు, ఈవ్ టీజింగ్ వంటి ఘటనలను ఈ యాప్ ద్వారా నేరుగా పోలీసులకు తెలియజేయవచ్చని చెప్పారు. ఈ యాప్ వినియోగంపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక శక్తి బృందాలు స్కూళ్లు, కళాశాలల్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయని తెలిపారు.

రోడ్డు భద్రతపై సూచనలు:
మద్యం సేవించి వాహనాలు నడపడం, మైనర్లకు వాహనాలు ఇవ్వడం వంటి చర్యలు ప్రమాదాలకు దారి తీస్తున్నాయని పోలీసులు హెచ్చరించారు. హెల్మెట్ ధరించకపోవడం వల్లే ఎక్కువ ప్రమాదాలు ప్రాణాంతకమవుతున్నాయని గుర్తుచేశారు.చివరగా, విద్యార్థుల భద్రత, క్రమశిక్షణ, రోడ్డు నియమాలు పాటించాలనే అంశాలపై ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులు సూచించారు.
 
  
 






