చిలకలూరిపేట
పల్నాడు జిల్లా,చిలకలూరిపేట
క్రీడాకారులకు కూటమి ప్రభుత్వ సహాయసహకారాలు ఎప్పుడూ ఉంటాయని, మంచి ఆటతీరుతో రాష్ట్రానికి, దేశానికి మంచిపేరు తీసుకువచ్చేలా యువత వారికి నచ్చిన క్రీడల్లో రాణించాలని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు సూచించారు. శనివారం ఆయన సంక్రాంతి పండుగ సందర్భంగా నాదెండ్ల మండలం చందవరంలో ఏర్పాటు చేసిన క్రికెట్ పోటీలను టాస్ వేసి ప్రారంభించి, క్రీడాకారులు, గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడారు. సంక్రాంతి పండుగ అంటేనే తెలుగురాష్ట్రాల్లో ఎక్కడాలేని కోలాహాలం, సంబరాలు మొదలవుతాయని, రంగవల్లులు.. గొబ్బెమ్మలు… హరిదాసు కీర్తనలు.. గంగిరెద్దుల విన్యాసాలతో గ్రామాలు కొత్తశోభను సంతరించుకుంటాయని పుల్లారావు చెప్పారు. క్రీడలపై మక్కువ పెంచుకునే యువత అంచెలంచెలుగా ఉన్నతస్థానాలకు ఎదిగేలా ఆయా రంగంలో రాణించాలని, ఆ దిశగా కఠోరసాధన చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కుటుంబాలను నిర్లక్ష్యం చేసి క్రీడలను ఆదరించడం, అభిమానించడం ఎవరికీ ఎప్పటికీ మంచిది కాదనే వాస్తవాన్ని యువత గ్రహించాలన్నారు. గ్రామంలో జరిగే క్రికెట్ మ్యాచ్ లలో ఎవరైనా ఉత్తమ ప్రదర్శన చేసినట్టయితే, వారిపేరును రాష్ట్రస్థాయికి సిఫార్సు చేస్తానని పుల్లారావు చెప్పారు. క్రీడాకారుల కోరిక మేరకు, వారిని ఉత్సాహపరిచేందుకు మాజీ మంత్రి కాసేపు బ్యాటింగ్ చేశారు. మ్యాచ్ నిర్వాహకుల కోరిక మేరకు గ్రామ యువతకు టీ షర్ట్ లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో వెంకటరామి రెడ్డి, సిద్దా రెడ్డి, బుల్లయ్య, చిన్న పుల్లా రెడ్డి గ్రమా నాయకులు తదితరులు పాల్గొన్నారు.