బాపట్ల, అక్టోబర్ 6 :పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పగలు, రాత్రి తేడా లేకుండా క్లాప్ మిత్రులు కృషిచేయడం వల్లే బాపట్ల జిల్లాకు విస్తృతంగా అవార్డులు లభించాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ అన్నారు. సోమవారం కమ్మ కళ్యాణ మండపంలో జరిగిన స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర అవార్డుల ప్రదానోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడారు.
వేడుకల సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి, మహాత్మా గాంధీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ప్రారంభించారు. అనంతరం రాష్ట్ర స్థాయి మరియు జిల్లా స్థాయి అవార్డులను ఎంపికైన వారికి కలెక్టర్ చేతుల మీదుగా ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రానున్న మూడు నెలల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించనున్నట్లు ప్రకటించారు. వ్యర్థాలను శాస్త్రీయంగా తొలగించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. చెత్త సంపద కేంద్రాలను సమర్థంగా నిర్వహిస్తున్నామని, జిల్లాలో పరిశుభ్రతను ప్రజా ఉద్యమంగా తీర్చిదిద్దుతున్నామని అన్నారు.
స్వచ్ఛంద్ర 2047 లక్ష్యాలు నేపథ్యంలో నెలనెలా ఒక అంశాన్ని ప్రాధాన్యతగా తీసుకుని, సమర్థంగా కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో, క్లాప్ మిత్రుల కృషితో రాష్ట్రవ్యాప్తంగా బాపట్ల జిల్లా నిలదొక్కుకున్నదన్నారు. ఈ సందర్భంగా అవార్డులు అందుకున్న క్లాప్ మిత్రులను ప్రత్యేకంగా సన్మానించారు.
జిల్లాలో మొత్తం 49 అవార్డులు లభించాయని, చెరుకుపల్లి మండలంలోని కావూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రాష్ట్ర స్థాయి స్వచ్ఛత అవార్డును పొందిందని తెలిపారు. 146 గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు.
ఇంచార్జ్ సంయుక్త కలెక్టర్ గంగాధర్ గౌడ్ మాట్లాడుతూ, పారిశుద్ధ్య కార్మికుల కృషితోనే ప్రజల ఆరోగ్యం మెరుగుపడిందన్నారు. చెత్తను సంపదగా మలచే విధంగా కేంద్రాల నిర్వహణ జరుగుతోందన్నారు. మొక్కలు నాటడం, పెంచడం పర్యావరణాన్ని ఆహ్లాదంగా మార్చుతుందని పేర్కొన్నారు.
బుడా చైర్మన్ చలగాల రాజశేఖర్ బాబు మాట్లాడుతూ, బాపట్లను ఆదర్శ జిల్లా గా తీర్చిదిద్దడంలో అధికారులు కంకణబద్ధులై ఉన్నారని కొనియాడారు. పారిశుద్ధ్య కార్మికులను సన్మానించడం హర్షణీయమన్నారు.
రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ నారాయణ భట్టు, మున్సిపల్ కమిషనర్ రఘునాథ రెడ్డి, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్లు ఎం. వెంకటరమణ, చిన్న శ్రీనివాసరావు తదితరులు కార్యక్రమంలో పాల్గొని పరిశుభ్రతపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ కార్యక్రమాలలో స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యం వల్ల మంచి ఫలితాలు వచ్చాయని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీఓ పి. గ్లోరియా, డిపిఓ ప్రభాకర్ రావు, ఇతర శాఖల అధికారులు, అవార్డు గ్రహీతలు, ప్రజాప్రతినిధులు పెద్దఎత్తున పాల్గొన్నారు.