పర్చూరు, సెప్టెంబర్ 20:
పారిశుద్ధ్య కార్మికుల సేవలు అమూల్యమని పర్చూరు ఎమ్మెల్యే సాంబశివరావు పేర్కొన్నారు. శనివారం ఉదయం పర్చూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన “స్వచ్చంద్ర – స్వర్ణాంధ్ర” కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు సమక్షంలో నిర్వహించారు. ఇందులో పారిశుద్ధ్య కార్మికులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులకు శాలువాలతో సన్మానం చేయడంతో పాటు, వారికి అవసరమైన పరికరాలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సాంబశివరావు మాట్లాడుతూ, “పారిశుద్ధ్య కార్మికుల సేవలు సమాజానికి ఎంతో అవసరం. ప్రజలు వారికి సహకరించాలి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది,” అని తెలిపారు.
పని సమయంలో ప్రభుత్వం అందించిన యూనిఫాం, హెల్మెట్ వాడకాన్ని తప్పనిసరి చేయాలని సూచించారు.
జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ,
“సినిమా నటులతో ‘కాఫీ విత్’ వంటి కార్యక్రమాలు ఢిల్లీ, ముంబైలో జరుగుతాయి. అలాంటి వినూతన ఆలోచనను గ్రామస్థాయిలో అమలు చేయడం అభినందనీయమైన విషయం. పారిశుద్ధ్య కార్మికులు సమాజంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. పరిశుభ్రత ద్వారా అనేక వ్యాధులను నివారించవచ్చు. కార్మికుల ఆరోగ్యం కూడా అత్యంత ముఖ్యం” అని అన్నారు.
అంతేకాక, పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్య పరీక్షల కోసం ప్రత్యేక హెల్త్ క్యాంపులు రెండు వారాల్లో ఏర్పాటు చేయనున్నట్టు కలెక్టర్ తెలిపారు. మహిళా కార్మికుల పిల్లల కోసం ప్రత్యేక స్పెషలిస్టులతో హెల్త్ క్యాంపులు కూడా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అవసరమైన మందులు ఉచితంగా అందించనున్నట్టు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్ రావు, ఆర్డీఓ గ్లోరియా, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.