
బుధవారం విశ్వకర్మ జయంతి సందర్భంగా స్థానిక కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో విశ్వకర్మ చిత్రపటానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ మరియు బాపట్ల శాసనసభ్యులు వేగేశిన నరేంద్ర వర్మ రాజు కలిసి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, బాపట్ల జిల్లాలోని ప్రజలకు, అధికారులకు, వివిధ విశ్వకర్మ సంఘం నాయకులకు విశ్వకర్మ జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు.రాష్ట్ర ప్రభుత్వం విశ్వకర్మ జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించుటకు ఉత్తర్వులు జారీ చేసిందని ఆయన తెలిపారు. విశ్వకర్మ సిద్ధాంతాలను పాటిస్తూ నిర్మాణాలు కొనసాగుతున్నాయని ఆయన అన్నారు. ఏ యుగంలోనైనా విశ్వకర్మ వారి కృషి నుండి దేశం ముందుకు వెళుతుందని, రాష్ట్రాల అభివృద్ధి జరుగుతుందని ఆయన అన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ విశ్వకర్మ కుల వృత్తుల వారి అభివృద్ధికి ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన అనే పథకాన్ని తీసుకువచ్చారని ఆయన తెలిపారు. ఈ పథకాన్ని జిల్లాలో అమలు చేస్తూ విశ్వకర్మ కుల వృత్తులు చేసే వారికి బ్యాంకు రుణాలు అందజేసి, వారి అభివృద్ధికి సహాయ సహకారాలు అందజేస్తామని, ఈ అవకాశాన్ని విశ్వకర్మ కుల వృత్తుల వారు అందిపుచ్చుకొని అభివృద్ధి చెందాలని జిల్లా కలెక్టర్ తెలిపారు.ఈ సందర్భంగా బాపట్ల శాసనసభ్యులు వేగేశిన నరేంద్ర వర్మ రాజు మాట్లాడుతూ, విశ్వకర్మ సంఘ సభ్యులకు విశ్వకర్మ జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లాలో విశ్వకర్మ కులస్తులకు ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా, వారి అభివృద్ధికి సహాయపడతారని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ జిల్లా సంయుక్త కలెక్టర్ జి గంగాధర్ గౌడ్, రేపల్లె సహాయ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి బి శివ నాగేశ్వరరావు,జిల్లా అధికారులు, విశ్వకర్మ సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు.







