
అమరావతి, జనవరి 29 :– పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు ఆరోగ్య సూత్రాలు బోధించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని యోగా–నేచురోపతి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మంతెన సత్యనారాయణ రాజు సూచించారు. ఆరోగ్యకరమైన జీవన విధానంపై చిన్న వయసు నుంచే అవగాహన కల్పిస్తే భవిష్యత్‌లో అనారోగ్య సమస్యలను నివారించవచ్చని ఆయన పేర్కొన్నారు.
అమరావతిలో కరకట్టపై ఉన్న మంతెన సత్యనారాయణ ఆరోగ్యాలయాన్ని వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్, ఆరోగ్య–కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్, డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ చక్రధరబాబు, ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్టు సీఈఓ, ఆయుష్ కమిషనర్ దినేష్ కుమార్, ఎయిడ్స్ నియంత్రణ మండలి ప్రాజెక్టు డైరెక్టర్ నీలకంఠారెడ్డి సహా పలువురు ఉన్నతాధికారులు గురువారం సందర్శించారు.
ఈ సందర్భంగా మంతెన సత్యనారాయణ రాజుతో జరిగిన సమావేశంలో ‘యోగా–నేచురోపతి ద్వారా ప్రజల ఆరోగ్య సంరక్షణ’ అంశంపై చర్చించారు. విద్యార్థుల దినచర్యలో ప్రతిరోజూ 30 నిమిషాల యోగాభ్యాసం, 15 నిమిషాల ధ్యానంను తప్పనిసరిగా చేర్చాలని ఆయన సూచించారు.
మిల్లెట్ ఆధారిత, ప్రొటీన్ సమృద్ధి ఆహారాన్ని ప్రోత్సహించడం ద్వారా ‘ఆరోగ్యాంధ్రప్రదేశ్’ లక్ష్యాన్ని సాధించవచ్చని మంతెన పేర్కొన్నారు. యోగా, నేచురోపతిపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలకు తాను పూర్తిస్థాయిలో సహకరిస్తానని అధికారులకు హామీ ఇచ్చారు.Amaravathi news
ఆరోగ్య రంగంలో తీసుకురావాల్సిన మార్పులు, ప్రజల్లో అవగాహన పెంపు, మౌలిక వసతుల అభివృద్ధి, విధానపరమైన చర్యలపై అధికారులకు మంతెన సత్యనారాయణ రాజు సమగ్ర ప్రజెంటేషన్ ఇచ్చారు.
ఆరోగ్యాలయం వాతావరణం, నిర్వహణ తీరు, అందిస్తున్న సేవల పట్ల అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు.










