
NTR Vijayawada:జగ్గయ్యపేట, అక్టోబర్ 15:జగ్గయ్యపేట నియోజకవర్గంలో పత్తి సాగు చేసిన రైతుల నుంచి పత్తిని ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర రూ. 8,110/- కు వెంటనే కొనుగోలు చేయాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ తన్నీరు నాగేశ్వరరావు డిమాండ్ చేశారు.
బుధవారం పట్టణంలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “జగ్గయ్యపేట నియోజకవర్గంలో సుమారుగా 20 వేల ఎకరాల్లో రైతులు పత్తి సాగు చేస్తున్నారు. కానీ ప్రస్తుతం రైతులు దళారీల దుర్మార్గాల నుంచి నష్టాలు చవిచూస్తున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు తక్షణమే రైతుల నుంచి పత్తిని నేరుగా కొనుగోలు చేయాలి” అని అన్నారు.ఇంకా మాట్లాడుతూ, “మున్ముందు మూడు రోజుల్లో జగ్గయ్యపేట మార్కెట్ యార్డులో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి. లేదనుకుంటే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతుల హక్కుల కోసం ఉద్యమాలు చేపడతాం” అని హెచ్చరించారు.ఈ సమావేశంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు పఠాన్ ఫిరోజ్ ఖాన్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మండవ శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర రైతు విభాగ కార్యదర్శి నంబూరి రవి, రాష్ట్ర చేనేత విభాగం అధికార ప్రతినిధి పెంటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.






