
ఏలూరు జిల్లా (పోలవరం): ఉరుకులు పరుగుల జీవనశైలిలో వేగానికి ఇచ్చే ప్రాధాన్యతను భద్రతకు ఇవ్వకపోవడం వల్ల వాహనదారులు భారీ మూల్యం చెల్లించుకుంటున్నారని పోలవరం సీఐ బాల సురేష్ మరియు ఎస్సై పవన్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గ పరిధిలోని పట్టిసీమ గ్రామంలో హెల్మెట్ వాడకంపై పోలీసుల ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… రోడ్డు ప్రమాదాల్లో హెల్మెట్ లేకపోవడం వల్లే చాలామంది అక్కడికక్కడే మృతి చెందుతున్నారని, చిన్నపాటి నిర్లక్ష్యం నిండు ప్రాణాలను బలితీసుకుంటోందని పేర్కొన్నారు. “హెల్మెట్ భారం కాదు – భరోసా” అని గుర్తించాలని, ప్రాణాలను కాపాడుకునేందుకు ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరని సూచించారు. గమ్యాన్ని త్వరగా చేరుకోవాలనే ఆతృతలో హెల్మెట్ వాడకాన్ని విస్మరిస్తే ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుందని, ఇకపై నిబంధనలు అతిక్రమించి హెల్మెట్ లేకుండా ప్రయాణించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది మరియు స్థానిక వాహనదారులు పాల్గొన్నారు.http://ELURU NEWS







