విద్యాసంస్థల సర్క్యులర్ దహనం – PDSU ఆందోళన||PDSU Burns Circular Opposing Govt Restrictions in Colleges
విద్యాసంస్థల సర్క్యులర్ దహనం – PDSU ఆందోళన
ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (PDSU) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు, రాష్ట్ర ప్రభుత్వం విద్యాసంస్థల్లో ప్రజాస్వామ్యాన్ని హరిస్తూ జారీ చేసిన సర్క్యులర్‌కు వ్యతిరేకంగా ఆందోళన జరిగింది. ఆగస్టు 1న ప్రభుత్వం RJD, DEO లకు జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం, తల్లిదండ్రులు, స్కూల్ యాజమాన్య కమిటీలకు తప్ప ఇతర వ్యక్తులు, సంస్థలు విద్యాసంస్థల్లోకి ప్రవేశించరాదని ఆదేశాలు ఇచ్చింది. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా స్థానిక కోటదిబ్బ జూనియర్ కళాశాల వద్ద PDSU నగర కమిటీ ఆధ్వర్యంలో సర్క్యులర్‌ను దహనం చేశారు.
జిల్లా అధ్యక్షుడు కాకినాని మాట్లాడుతూ, గత 70 ఏళ్లుగా విద్యార్థి సంఘాలు ప్రభుత్వ విద్యాసంస్థల రక్షణలో కీలకపాత్ర పోషించాయని, ముఖ్యంగా వామపక్ష విప్లవ విద్యార్థి సంఘాలు విద్యార్థి-ఉపాధ్యాయ సంబంధాలను బలోపేతం చేశాయని తెలిపారు. ఈ సంబంధాల వల్ల విద్యాసంస్థల్లో ఉన్న అనేక సమస్యలు పరిష్కారమయ్యాయని చెప్పారు. విద్యాశాఖ మంత్రి గతంలో ప్రజా విద్యను బలోపేతం చేస్తామని, ప్రైవేట్ కార్పొరేట్ విద్యపై నియంత్రణ విధిస్తామని చెప్పి ఇప్పుడు మాట తప్పారని విమర్శించారు.
నగర అధ్యక్షుడు ఎం. యశ్వంత్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు NSUI విద్యార్థి సంఘంలో నుంచి రాజకీయ జీవితం ప్రారంభించారని గుర్తుచేశారు. 2004లో TNSFను స్థాపించి, విద్యార్థుల్లోకి వెళ్లి అధికారాన్ని సాధించిన పార్టీ, ఇప్పుడు విద్యార్థి సంఘాల ప్రవేశాన్ని నిరోధించడం విరోధాభాసమని అన్నారు. విద్యార్థులు, యువత రాజకీయాల్లోకి రావాలని చెప్పి, అడ్డంకులు సృష్టించడం సరైంది కాదన్నారు.
PDSU నేతలు, ఈ సర్క్యులర్‌ను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తేజ, అశోక్, కుమార్, ప్రదీప్, రాజు, రవి, వంశీ, వినోద్ తదితరులు పాల్గొన్నారు.