
ఏలూరు, అక్టోబర్ 19:19-10-25:-పేదల ఆరోగ్యానికి భరోసా, అవసరార్థులకు ఆర్థిక సాయం అందించాలనే సిద్ధాంతాలను కేంద్రబిందువుగా చేసుకుని, ప్రజల మేలు కోసం నిరంతరం కృషి చేస్తున్నామని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. “మంచి చేయాలనే సంకల్పం మనదే — అందుకే ఆ దిశగా ఎంత కష్టం వచ్చినా వెనక్కి తగ్గేదే లేదు,” అని ఆయన స్పష్టంగా తెలిపారు.ప్రజల ఆరోగ్య భద్రత కోసం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సాయం అందించే కార్యక్రమాన్ని వేగవంతం చేసిన ఎమ్మెల్యే చంటి, ఈ ప్రక్రియలో ముందడుగు వేశారు. ఇందుకోసం ఏలూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి, అనారోగ్యంతో బాధపడుతున్న వారు సమర్పించిన అర్జీలను సీఎం కార్యాలయానికి చేరేలా చర్యలు చేపట్టారు.

ఈ క్రమంలో ఆదివారం ఆయన 33 మంది బాధితులకు రూ.17 లక్షల 246 రూపాయల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేశారు. అదనంగా ఒకరికి ట్రైసైకిల్, నలుగురికి తోపుడు బండ్లు, క్యాన్సర్ పేషెంట్‌కు రూ.5 వేల ఆర్థిక సాయాన్ని అందించారు.
మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే చంటి, “ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలు వినడం మా బాధ్యత. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ప్రజలకు అందుబాటులో లేని నాయకత్వం కనబడింది. కానీ ఇప్పుడు కూటమి పాలనలో ఆ దుస్థితి మారింది” అని వ్యాఖ్యానించారు. ఎవరికైనా, ఎప్పుడైనా తనను నేరుగా కలిసే స్వేచ్ఛ ఉందని ఆయన తెలిపారు.

ఇప్పటివరకు ఏలూరు నియోజకవర్గంలో మొత్తం 316 మంది బాధితులకు రూ.3 కోట్ల 48 లక్షల 87 వేల 698 రూపాయల విలువైన సాయం సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు, ఎల్‌వోసిల రూపంలో అందించామని వెల్లడించారు. అలాగే దాతల సాయంతో క్యాన్సర్ రోగులకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నట్లు తెలిపారు.పేదలు స్వశక్తితో నిలబడే లక్ష్యంతో ఇప్పటివరకు 50 తోపుడు బండ్లు పంపిణీ చేసినట్లు వివరించారు. “వైసీపీ అరాచక పాలనకు చరమగీతం పాడిన ప్రజలే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి,” అని ఎమ్మెల్యే చంటి పిలుపునిచ్చారు.పేదల సంక్షేమం పట్ల కూటమి ప్రభుత్వం చూపుతున్న తాపత్రయాన్ని మీడియా ప్రజలకు విస్తృతంగా తెలియజేయాలని ఆయన సూచించారు.ఈ కార్యక్రమంలో ఈడా చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, ఎఏంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, నగర టిడిపి అధ్యక్షుడు చోడే వెంకటరత్నం, సీనియర్ నాయకుడు బెల్లపుకొండ కిషోర్, క్లస్టర్ ఇన్‌ఛార్జులు, డివిజన్ ఇన్‌ఛార్జులు, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.






