
విజయవాడ:నవంబర్ 12:-పేదల సొంతింటి కల సాకారమవుతున్న ఈ రోజు చారిత్రాత్మకమని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కలగన్న “ప్రతి పేదవాడికి సొంతిల్లు” అనే ఆశయాన్ని కూటమి ప్రభుత్వం విజయవంతంగా నెరవేర్చుతోందని ఆయన అన్నారు.ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టితో కేవలం 16 నెలల్లోనే 3 లక్షల ఇళ్లు పూర్తి చేసి పేదలకు తాళాలు అందజేయడం చరిత్రలో నిలిచిపోతుందని సాంబశివరావు పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా ప్రభుత్వం సంకల్పబలం కోల్పోలేదని, ఇళ్ల నిర్మాణం యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడం పేదల పట్ల ప్రభుత్వ అంకితభావానికి నిదర్శనమని తెలిపారు.
2014-19 మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం 12 లక్షల గృహాలను పూర్తి చేసి పేదలకు అందించిందని గుర్తుచేశారు. అదే పద్ధతిలో ప్రస్తుత కూటమి ప్రభుత్వం కూడా వేగంగా గృహనిర్మాణ పనులు సాగిస్తున్నదని తెలిపారు.జగన్ రెడ్డి పాలనలో పేదల కలలు చెదిరిపోయాయని తీవ్రంగా విమర్శించిన సాంబశివరావు, సెంటు పట్టా పేరుతో రూ.7,500 కోట్ల భారీ దోపిడీకి జగన్ రెడ్డి ముఠా పాల్పడిందని ఆరోపించారు. “పేదవాడి ఇంటికి సెంటు ఇచ్చి తానే కోట్ల విలువైన ప్యాలెస్ల్లో సేదతీరాడు. ఇసుక, భూమి, చదును పేర్లతో అవినీతికి పాల్పడ్డాడు” అని మండిపడ్డారు.“గత ప్రభుత్వం పేదల కలలకు తాళం వేసింది. కానీ నేటి కూటమి ప్రభుత్వం ఆ తాళం తెరిచి గౌరవంగా సొంతిల్లు ఇస్తోంది” అని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు.
సమగ్ర గృహనిర్మాణం – సమగ్ర అభివృద్ధి:
గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు కేటాయిస్తూ ప్రతి పేద కుటుంబానికి స్థలం కల్పిస్తున్నామని ఏలూరి తెలిపారు. సొంత స్థలం ఉన్నా ఇల్లు నిర్మించుకోలేని వారికి రూ.4 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నామని వివరించారు. ఇందులో రాష్ట్ర వాటా 40 శాతం (రూ.1.50 లక్షలు), కేంద్ర వాటా 60 శాతం (రూ.2.50 లక్షలు)గా ఉండడం వల్ల పథకం మరింత బలపడిందని అన్నారు.“2029 నాటికి రాష్ట్రంలోని ప్రతి అర్హుడికి పక్కా ఇల్లు ఇవ్వడం చంద్రబాబు నాయుడు ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. పేదలకు ఇళ్లు మాత్రమే కాదు, గౌరవం కూడా ఇస్తున్నాం” అని ఏలూరి సాంబశివరావు స్పష్టం చేశారు.







